సంచలనంగా మారిన జడ్చర్ల ఘటన
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జడ్చర్లలోని 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రికి సంబంధించి బాదేపల్లి మార్చురీలో పోస్టుమార్టం కోసం తీసుకొచ్చిన మృతదేహాన్ని వీధి కుక్కలు పీక్కు తిన్న అమానవీయ ఘటన సంచలనంగా మారింది. వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతుండగా.. రాజకీయ పక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. మరోవైపు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన రాష్ట్ర వైద్య ఆరోగ్య పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్.. ఇందుకు బాధ్యులుగా పేర్కొంటూ నలుగురిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రకళతో పాటు ఆర్‌ఎంఓ హరినాథ్, డ్యూటీ డాక్టర్ మునీషా, ఎంఎన్‌ఓ రవిప్రకాశ్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్‌ఎంఓ పోస్ట్ ఖాళీగా ఉన్నా.. ప్రభుత్వం నుంచి గానీ, సూపరింటెండెంట్ నుంచి గానీ ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకున్నా ఇన్‌చార్జిగా పేర్కొంటూ హరినాథ్‌పై వేటు వేయడం వైద్యారోగ్య శాఖలో దుమారం రేపుతోంది.
అంతా మౌఖికంగానే..
జడ్చర్ల ఏరియా ఆస్పత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (పీడియాట్రిషన్)గా హరినాథ్ 2022 మార్చి 3న విధుల్లో చేరారు. ఆయన జాయినింగ్‌కు ముందు, ఆ తర్వాత కూడా ఆస్పత్రిలో ఆర్‌ఎంఓ పోస్ట్ లేనే లేదు. ఇటీవల నెలన్నర, రెండు నెలల క్రితం కొత్తగా ఆర్‌ఎంఓ పోస్ట్ మంజూరు కాగా.. ఇప్పటివరకు అధికారికంగా ఎవరినీ నియమించలేదు. హరినాథ్‌ను ఆర్‌ఎంఓగా నియమిస్తూ ఎలాంటి అధికార ఉత్తర్వులు లేవని సమాచారం. సూపరింటెండెంట్ చంద్రకళకు ముందు ఉన్న అప్పటి అధికారి హరినాథ్‌ను ఇన్‌చార్జి ఆర్‌ఎంఓగా బాధ్యతలు చూడాలని మౌఖికంగా ఆదేశించినట్లు తెలిసింది. ఇదే ఆనవాయితీగా రాగా.. ప్రస్తుత ఘటన నేపథ్యంలో హరినాథ్‌పై సస్పెన్షన్ వేటు వేయడంతో రాద్ధాంతం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై సస్పెన్షన్‌కు గురైన సూపరింటెండెంట్ చంద్రకళను ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించగా.. ఆయనను ఆర్‌ఎంఓగా నియమిస్తూ అధికార ఉత్తర్వులు లేవని.. నోటి మాటగానే చెప్పినట్లు వెల్లడించారు.
జడ్చర్లలో కొత్తగా నిర్మించిన వంద పడకల ఆస్పత్రి
సంబంధం లేకున్నా బలిచేశారు..
వాస్తవానికి నేను ఆర్‌ఎంఓను కాదు. నన్ను ఆర్‌ఎంఓగా పేర్కొనడం చూసి ఆశ్చర్యపోయాను. ఘటన చోటుచేసుకున్న సోమవారం రోజు నా డ్యూటీ సమయం ప్రకారం ఉదయం 9 గంటలకు ఆస్పత్రికి వెళ్లా. డ్యూటీ అనంతరం సాయంత్రం 4 గంటలకు ఆస్పత్రి నుంచి వచ్చేశాను. మార్చురీలో జరిగిన సంఘటన నాకు తెలియదు. ఆ సమయంలో నేను ఆన్‌డ్యూటీలో కూడా లేను. జరిగిన ఘటన బాధాకరమే.. అయినా నా నిర్లక్ష్యం లేకున్నా నాపై సస్పెన్షన్ వేటు వేయడం అన్యాయం. దీన్ని మా డాక్టర్స్ యూనియన్ దృష్టికి తీసుకెళ్లాను. ఉన్నతాధికారులు మరోసారి సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలి.
– డాక్టర్ ఎస్.హరినాథ్, సీఏఎస్ (పీడియాట్రిషన్)
మృతదేహాన్ని వీధికుక్కలు
పీక్కు తినడంపై విపక్షాల ఆగ్రహం
నలుగురిపై సస్పెన్షన్ వేటు వేసిన కమిషనర్
ఇన్‌చార్జి ఆర్‌ఎంఓ హరినాథ్‌పై వేటుతో కలకలం
తనను ఎప్పుడు ఇన్‌చార్జిగా నియమించారో తనకే తెలియదంటూ ఆశ్చర్యం
మౌఖికంగానే తప్ప ఎలాంటి
అధికార ఉత్తర్వులు లేవని వెల్లడి
డాక్టర్స్ యూనియన్‌కు ఫిర్యాదు.. సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్


