వచ్చే ఏడాది తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు
మిడ్జిల్: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం వంద తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యుడు చారకొండ వెంకటేష్ అన్నారు. గురువారం ఆయన డీఈఓ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి మిడ్జిల్‌లోని ఉన్నత పాఠశాలను సందర్శించారు. బుధవారం ఉపాధ్యాయులు పాఠశాల సమయంలో ఫంక్షన్‌కు వెళ్లడంతో గ్రామస్తులు పాఠశాల గేట్‌కు తాళం వేసిన సంఘటనపై డీఈఓతో కలిసి విచారించారు. ఇదే సమయంలో పాఠశాల హెచ్‌ఎంను ఉపాధ్యాయుడు అసభ్య పదజాలంతో దూషించడంతో సదరు ఉపాధ్యాయుడిని హెచ్‌ఎం చెప్పుతో కొట్టే ప్రయత్నం చేయగా తోటి ఉపాధ్యాయులు అడ్డుకున్నారు. అసభ్య పదజాలంతో దూషించిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని డీఈఓ తెలిపారు. అలాగే బుధవారం పాఠశాల సమయంలో బయటకు వెళ్లిన వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. అనంతరం విద్యా కమిషన్ సభ్యుడు మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నామన్నారు. నిరుపేద విద్యార్థుల సంక్షేమం కోసం ఈ విద్యా సంవత్సరం పైలెట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో నాలుగు పాఠశాలలను ఎంపిక చేసి పబ్లిక్ స్కూళ్లను ప్రారంభించడం జరిగిందని వచ్చే విద్యా సంవత్సరం మండలానికి రెండు చొప్పున తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తామని, తద్వారా నిరుపేదలకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శంకర్, గ్రామస్తులు వెంకటయ్య, బాలయ్య, బుచ్చయ్య, రాముగౌడ్, శివ, నిరంజన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


