మార్కెట్‌కు పోటెత్తిన ఉల్లి
దేవరకద్ర: స్థానిక మార్కెట్‌కు బుధవారం వివిధ గ్రామాల నుంచి రైతులు పెద్ద ఎత్తున ఉల్లిని అమ్మకానికి తీసుకొచ్చారు. దీంతో ఉల్లి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. గత వారంతో పోల్చితే ప్రస్తుతం ధరలు సగానికి పడిపోవడంతో రైతులు వాపోయారు.
వేలంలో పెరగని ధరలు
దేవరకద్ర మార్కెట్‌లో ఉల్లి వేలం జోరుగా సాగిన ధరలు మాత్రం పెరగలేదు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వేలం కొనసాగింది. అయితే కొన్ని కుప్పలను వేలం లేకుండానే ధరలు నిర్ణయించి వ్యాపారులు కొనుగోలు చేశారు. వేలంలో క్వింటాల్ ఉల్లి ధర గరిష్టంగా రూ.1,300, కనిష్టంగా రూ. 900 వరకు పలికింది. గత వారం గరిష్టంగా రూ.1,800, కనిష్టంగా రూ.1,200 వరకు ధరలు పలికాయి. ఈ వారం ఒక్కసారిగా గరిష్టంగా రూ.500, కనిష్టంగా రూ. 300 వరకు తగ్గింది. వేలం తరువాత మార్కెట్‌లో 50 కేజీల బస్తాలుగా తూకం వేసి అమ్మకాలు సాగించారు. బస్తా ధర గరిష్టంగా రూ. 600 నుంచి 650, కనిష్టంగా రూ. 450 నుంచి రూ. 500 వరకు విక్రయించారు.
చిరుత దాడిలో గేదె దూడ మృతి
గద్వాల(మల్దకల్): చిరుత దాడిలో గేదె దూడ మృతి చెందిన ఘటన మండలంలోని మద్దెలబండ చిన్నతండా గ్రామ సమీపంలోని ఉండ్రాలగుట్ట వద్ద బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన రైతు వీరన్న రోజులాగే తన పశువులను వ్యవసాయ పొలంలోని కొట్టం వద్ద ఉంచాడు. రాత్రి ఎవరూ లేని సమయంలో దూడపై చిరుత దాడి చేసి చంపినట్లు బాధితుడు తెలిపారు. పొలం పరిసరాల్లో ఉన్న గుట్టల్లో చిరుత సంచరిస్తున్నట్లు రైతులు ఫారెస్టు అధికారులకు సమాచారం తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్టు డిప్యూటీ రేంజ్ అధికారి సుమలత, సిబ్బంది ప్రసూన, శ్వేత చిరుత జాడపై దర్యాప్తు చేపట్టారు. జాడలు సరిగా కనబడకపోవడంతో దూడపై దాడి చేసి చంపింది చిరుతనా లేదా హైననా అని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. రైతులు ఒంటరిగా వ్యవసాయ పొలాలకు వెళ్లవద్దని, రాత్రుళ్లు పొలాల వద్ద పశువులను ఉంచవద్దని సూచించారు.


