శిక్షణ పొందిన న్యాయవాదులకు పెండింగ్ కేసులు అప్పగిస్తాం
పాలమూరు: శిక్షణ సమయంలో న్యాయవాదులు నేర్చుకున్న అంశాలను కేసుల పరిష్కారానికి ఉపయోగించాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత అన్నారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని ఎన్‌టీఆర్ మహిళ డిగ్రీ కళాశాలలో ‘మీడియేషన్–మెళకువలు’అనే అంశంపై ప్రత్యేకంగా ఎంపిక చేసిన న్యాయవాదులకు 40 గంటల పాటు నిర్వహించిన శిక్షణ ముగింపులో న్యాయమూర్తి మాట్లాడారు. కోర్టు ద్వారా కేటాయించిన కేసులలో న్యాయవాదులు వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. జిల్లాలోని కోర్టులలో పెండింగ్ ఉన్న కేసులను ఇప్పటికే గుర్తించామన్నారు. రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే వాటిని శిక్షణ పొందిన న్యాయవాదులకు అప్పగిస్తామన్నారు. తమిళనాడుకు చెందిన ప్రత్యేక శిక్షకులు మీడియేషన్‌లో మెళకులను సమర్థవంతంగా శిక్షణ ఇచ్చినట్లుతెలిపారు. అనంతరం శిక్షణ పొందిన న్యాయవాదులకు సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర పాల్గొన్నారు.


