‘హస్త’గతం..
కాంగ్రెస్ ఖాతాల కార్పొరేషన్‌తో సహా 16 పుర పీఠాలు
● అయిజ, అలంపూర్‌లో బీఆర్‌ఎస్.. నారాయణపేటలో బీజేపీ
● అమరచింతలో ట్విస్ట్.. ‘కారు’ను పల్టీ కొట్టించిన మంత్రి వాకిటి
● కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన బీఆర్‌ఎస్ కౌన్సిలర్.. ఆమెకే చైర్మన్ గిరి
● గద్వాలలో చేతికే చిక్కిన మున్సిపాలిటీ.. బీజేపీ వాకౌట్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరులో ‘పుర’ పోరులో సత్తా చాటిన హస్తం.. పీఠాలు కై వసం చేసుకోవడంలోనూ హవా కొనసాగించింది. మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌తో పాటు మరో 18 మున్సిపాలిటీల్లో జరిగిన ఎన్నికల్లో ఫలితాలు వెలువడిన రోజే మ్యాజిక్ ఫిగర్‌కు ఒకటి, రెండడుగుల దూరంలో ఉన్న మహబూబ్‌నగర్, దేవరకద్రతో సహా మొత్తంగా కాంగ్రెస్ 13 పుర పీఠాలు కై వసం చేసుకుంది. వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఏఐఎఫ్‌బీ విజయం సాధించగా.. గెలుపొందిన కౌన్సిలర్లు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో 14 హస్తగతమయ్యాయి. వీటితో పాటు హంగ్ ఏర్పడిన నాలుగింటిలో అమరచింత, గద్వాల పీఠాలనూ చేజిక్కించుకుంది. దీంతో మొత్తంగా ఆ పార్టీ కార్పొరేషన్‌తో కలుపుకుని 16 పురపాలికల్లో మేయర్/చైర్మన్, డిప్యూటీ మేయర్/వైస్ ౖచైర్మన్ పదవులను అధిరోహించింది. బీఆర్‌ఎస్ అయిజ, అలంపూర్.. బీజేపీ నారాయణపేటలో పాగా వేసింది.


