అమరచింతలో బెడిసికొట్టిన వ్యూహం
అమరచింత: ‘అనుకున్నది ఒక్కటి.. అయిందొక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్ పిట్ట’ అనే పాట మాదిరిగానే అమరచింత మున్సిపల్ రాజకీయం మారిపోయింది. మూడు రోజులుగా క్యాంపు రాజకీయాల్లో గడిపిన బీఆర్‌ఎస్, బీజేపీలకు చెందిన ఆరుగురు కౌన్సిలర్లలో బీఆర్‌ఎస్‌కు చెందిన కౌన్సిలర్ కారు దిగి కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో వ్యూహం బెడిసికొట్టింది. సోమవారం ఉదయం వరకు బీఆర్‌ఎస్, బీజేపీల పొత్తుతోనే మున్సిపల్ పీఠం దక్కించుకుంటారనుకున్న సమయంలోనే 2వ వార్డు నుంచి గెలుపొందిన బీఆర్‌ఎస్ కౌన్సిలర్ జింక సువర్ణకు కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్ పదవి ఆఫర్ రావడంతో ఒక్కసారిగా రాజకీయం తారుమారైంది. చివరికి మంత్రి వాకిటి శ్రీహరి ఎక్స్ అఫీషియో ఓటుతో అమరచింత మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకుంది. గంట సమయంలోనే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రలోభపెట్టి తమవైపు తిప్పుకోవడం అప్రజాస్వామికం అని ఆవేదన వ్యక్తం చేశారు.
మున్సిపాలిటీ ఎదుట హైటెన్షన్
బీఆర్‌ఎస్ కౌన్సిలర్ పార్టీ ఫిరాయిస్తుందనే సమాచారం తెలియడంతో బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున్న మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. కాంగ్రెస్ నాయకుల అనైతిక చర్యను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సైతం కాంగ్రెస్ నీచ రాజకీయాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. దీంతో పోలీసులు బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులను చెదరగొట్టి ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకుండా చర్యలు చేపట్టారు.
అమరచింతలో బెడిసికొట్టిన వ్యూహం


