చాంపియన్ మహబూబ్‌నగర్
జడ్చర్ల టౌన్: జడ్చర్లలో జరుగుతున్న రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్ బాలుర అండర్–17 క్రికెట్ చాంపియన్‌షిప్‌ను మహబూబ్‌నగర్ కై వసం చేసుకుంది. సోమవారం జడ్చర్ల మినీ స్టేడియంలో ఖమ్మం జట్టుతో ఫైనల్ మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగగా.. పాలమూరు 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మహబూబ్‌నగర్ 15 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. రామాచారి 31 పరుగులు, కేతాన్ 30 పరుగులు సాధించారు. 111 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఖమ్మం జట్టు 5 వికెట్లు కోల్పోయి 107 పరుగుల వద్దే నిలిచిపోయింది. అంతకుముందు హైదరాబాద్ జట్టుతో జరిగిన మొదటి సెమీఫైనల్‌లో మహబూబ్‌నగర్ నిర్ణీత 15 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. రామాచారి 40 బంతుల్లో 65 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 143 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన హైదరాబాద్ 13.2 ఓవర్లలో 83 పరుగులకే కుప్పకూలింది. దీంతో మహబూబ్‌నగర్ 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో సెమీస్‌లో ఖమ్మం నల్లగొండపై 8 వికెట్ల తేడాతో నెగ్గింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌పై నల్లగొండ విజయం సాధించింది. ముగింపు కార్యక్రమంలో ఏఎంఓ శ్రీనివాస్ విజేతలకు ట్రోఫీలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్‌లో జరిగే జాతీయస్థాయి టోర్నీలో రాణించి రాష్ట్రం పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టోర్నీ కోఆర్డినేటర్ మంజులాదేవి, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి శారదబాయి, మార్కెట్ చైర్మన్ జ్యోతి, పీడీలు, కోచ్‌లు పాల్గొన్నారు.
ఫైనల్లో ఖమ్మంపై
4 పరుగులతో విజయం
మూడోస్థానంలో నల్లగొండ
ముగిసిన ఎస్‌జీఎఫ్ బాలురఅండర్–17 రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నీ


