చైర్మన్ పదవి ఇవ్వాలని మద్దతుదారుల నిరసన
కొత్తపల్లి(మద్దూరు): మద్దూరు మున్సిపాలిటీ పరిధిలోని రెనివట్ల గ్రామం నుంచి గెలిచిన నలుగురు కౌన్సిలర్లకు పదవులు ఇవ్వాలని కోరుతూ రెనివట్ల గ్రామానికి చెందిన మద్దతుదారులు సోమవారం మాజీ జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి రఘపతిరెడ్డి ఇంట్లో ఉన్నట్లు తెలియడంతో 10వ వార్డు కౌన్సిలర్ గడ్డమీది గోవిందుకు చైర్మన్ పదవి ఇవ్వాలని కోరుతూ ఆయన భార్య గడ్డమీది ఉషా, ఆమెకు మద్దతుగా దాదాపు మరో 150 మంది అభిమానులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అత్యధిక కౌన్సిలర్ల మద్దతు తమకే ఉన్నా, పార్టీ అధిష్టానం మాత్రం చెప్పుడు మాటలు విని ఇతరులకు చైర్మన్ పదవి ఇవ్వడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకానోక దశలో ఇంటి ముందు ఉన్న కార్లపైకి దుమ్మెత్తిపోయడంతో డిఎస్పీ లింగయ్య వారిని వారించే ప్రయత్నం చేశారు. అయినా వినకపోవడంతో చివరికి లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు.


