చెరగని సిరా చుక్క
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఓటరు చేతివేలికి వేసే సిరా చుక్కకు ఓ లెక్కుంది. ఒకసారి ఓటేసిన ఓటరు మళ్లీ అదే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోకుండా చేసిన ప్రత్యేక ఏర్పాటే ఇది. చేతివేలికి పెట్టే ఇంకు చుక్క కొన్ని రోజుల వరకు చెరిగిపోదు. శరీర తత్వాన్ని బట్టి కొందరికి నెలరోజుల వరకు కూడా ఉంటుంది. ఈ ఇంకును కర్ణాటకలోని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ కంపెనీ తయారు చేస్తోంది. కౌన్సిల్ ఆప్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రిసెర్చ్ (సీఎస్‌ఐఆర్)కు చెందిన నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ దీన్ని అభివృద్ధి చేసింది. ఇంకు ఉత్పత్తి కోసం 1962లో మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిడెట్ కంపెనీకి అనుమతి ఇచ్చింది. ఇందులో 7.15 శాతం సిల్వర్ నైట్రేట్ ఉంటుంది. ఈ మిశ్రమంతో కూడిన ఇంకును ఇతర రసాయనాలతో సులభంగా చెరిపివేయలేరు. ఎడమ చూపుడు వేలి గోరు పైభాగం నుంచి ఇంకు చుక్క వేస్తారు.


