ప్రత్యర్థుల అవమానం.. యువకుడి ఆత్మహత్యాయత్నం
గట్టు: మండల పరిధిలోని యల్లందొడ్డిలో సర్పంచ్ అభ్యర్థి అంపగాళ్ల జయసుధ కుమారుడు అంజి సోమవారం అత్మహత్యాయత్నం చేశాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. యల్లందొడ్డిలో సర్పంచ్ పదవికి ముగ్గురు మహిళలు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో జయసుధ నడిగడ్డ హక్కుల పోరాట సమితి మద్దతులో పోటీ చేస్తున్నారు. ఆమె కుమారుడు అంజిని ఎన్నికల్లో నిలబడి గెలువగలరా అంటూ ప్రత్యర్థులు అవమానకరంగా మాట్లాడినట్లు తెలిపారు. దీంతో అంజి మనస్థాపం చెంది పురుగు మందు తాగాడు. స్థానికులు గుర్తించి చికిత్స నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, మెరుగైన చికిత్స నిమిత్తం గద్వాల ఆస్పత్రికి తరలించారు.
సెల్‌టవర్ ఏర్పాటు చేస్తామని డబ్బులు స్వాహా
జడ్చర్ల: పొలంలో టవర్ ఏర్పాటు చేస్తామని ఓ వ్యక్తిని బురిడీ కొట్టించి డబ్బు కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ కవులాకర్ కథనం మేరకు.. మిడ్జిల్ మండలంలోని వస్పులకు చెందిన గొరిగె చంద్రశేఖర్ స్థానిక గౌరీశంకర్ కాలనీలో నివాసముంటున్నాడు. అతనికి గతనెల 18వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి మీ పొలంలో వి1 టవర్ ఏర్పాటు చేస్తామని.. దాంతో మీకు అధిక మొత్తం అందుతుందని ఆశచూపించారు. ఇందుకుగానూ ప్రాసెసింగ్ ఫీజు, ట్యాక్స్, తదితరాల కోసం విడతల వారీగా రూ.45, 250 ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. రూ.10లక్షలు మీ బ్యాంకు ఖాతాలో జమచేస్తామని నమ్మబలికారు. తర్వాత ఎన్ని పర్యాయాలు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో బాధితుడు నేషనల్ సైబర్ క్రైం టోల్‌ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు.
చికిత్స పొందుతూ బాలిక మృతి
తిమ్మాజిపేట: మండల పరిధిలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన కర్నేకోట రేణుక(16) అనే బాలిక సోమవారం ఫిట్స్‌తో మృతి చెందింది. గ్రామానికి చెందిన యాదయ్య, తిరుపతమ్మ రెండో కుమార్తె రేణుకకు ఆదివారం ఫిట్స్ రావడంతో చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రత్యర్థుల అవమానం.. యువకుడి ఆత్మహత్యాయత్నం


