విలువిద్యలో ప్రతిభ
●
ఒలింపిక్‌లో
పాల్గొనడమే లక్ష్యం
చిన్నప్పటి నుంచి క్రీడల అంటే ఎంతో ఇష్టం. ఆరేళ్ల నుంచి ఆర్చరీలో కోచ్ జ్ఞానేశ్వర్ వద్ద శిక్షణ తీసుకుంటున్న. భవిష్యత్‌లో దేశం తరఫున ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యం. అందుకు నిరంతరం ప్రాక్టిస్ చేస్తున్న.
– రమావత్ రవి,
ఆర్చరీ క్రీడాకారుడు, మహబూబ్‌నగర్
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రానికి చెందిన రమావత్ రవి ఆర్చరీలో విశేష ప్రతిభ కనబరుస్తున్నాడు. ఆరేళ్ల నుంచి కోచ్ జ్ఞానేశ్వర్ వద్ద రవి ఆర్చరీలో మెరుగైన శిక్షణ తీసుకుంటున్నాడు. ఆర్చరీ పోటీల్లో ఇండియన్ రౌండ్‌లో రాణిస్తూ పతకాలు సాధిస్తున్నాడు.
రమావత్ రవి ఆర్చరీ కెరీర్
ఇప్పటి వరకు 14సార్లు రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో జిల్లాకు ప్రాతినిధ్యం వహించాడు. రాష్ట్రస్థాయిలో 2024 వరంగల్‌లో జరిగిన ఎస్‌జీఎఫ్ అండర్–19 రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో ఇండియన్ రౌండ్‌లో బంగారు పతకం, సబ్ జూనియర్ పోటీల్లో బంగారు పతకం, హైదరాబాద్‌లో జరిగిన సీనియర్ పోటీల్లో బంగారు పతకం, ఈ ఏడాది జనవరిలో 12న హైదరాబాద్‌లో జరిగిన జూనియర్ ఆర్చరీ పోటీల్లో రజతం సాధించాడు. ఈ ఏడాది నవంబర్‌లో హైదరాబాద్ కొల్లూర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ పోటీల్లో కాంస్యం సాధించాడు. ఈనెల 7వ తేదీన హైదరాబాద్ కొల్లూర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ ఆర్చరీ పోటీల్లో ఇండియన్ రౌండ్‌లో రవి మెరుగైన ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించాడు. హైదరాబాద్‌లో ఈనెల 10 నుంచి 16వరకు జరిగే సీనియర్ నేషనల్ ఆర్చరీ పోటీలకు ఎంపికయ్యాడు.
జాతీయస్థాయిలో నాలుగుసార్లు
రమావత్ రవి ఇప్పటివరకు నాలుగుసార్లు జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాడు. 2023 మధ్యప్రదేశ్‌లో ఎస్‌జీఎఫ్ అండర్–17 జాతీయస్థాయి పోటీల్లో ఇండియన్ రౌండ్‌లో పాల్గొన్నాడు. 2024లో గుజరాత్ రాష్ట్రం నడియాడ్‌లో ఎస్‌జీఎఫ్ అండర్–19 పోటీల్లో రజత పతకం సాధించాడు. జంషెడ్‌పూర్‌లో జరిగిన సీనియర్ నేషనల్, రాజస్థాన్‌లో జరిగిన సబ్ జూనియర్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొన్నాడు. ఈ ఏడాది అక్టోబర్‌లో పంజాబ్‌లోని గురుకాశి యూనివర్సిటీలో జరిగిన ఆలిండియా ఆర్చరీ పోటీల్లో పాలమూరు యూనివర్సిటీ నుంచి ప్రాతినిధ్యం వహించాడు.
జాతీయ క్రీడల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం
ఉత్తరాఖండ్‌లో ఈ ఏడాది జనవరి 31 నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు జరిగిన 38వ జాతీయ క్రీడల్లో రవి పాల్గొన్నాడు. ఆర్చరీలో తెలంగాణ నుంచి పురుషుల విభాగంలో ఇద్దరు క్రీడాకారుల్లో రవి కూడా జాతీయ క్రీడల్లో పాల్గొనడం విశేషం
రాష్ట్ర, జాతీయ స్థాయిలో రమావత్ రవి రాణింపు
జాతీయ క్రీడల్లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం
ఈ నెల 10 నుంచి జరిగే సీనియర్ నేషనల్‌కు ఎంపిక


