చీరకు నిప్పంటుకొని.. మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

చీరకు నిప్పంటుకొని.. మహిళ మృతి

Nov 4 2025 8:32 AM | Updated on Nov 4 2025 12:12 PM

కోస్గి రూరల్‌: చీరకు నిప్పు అంటుకోవడంతో ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మహిళ మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు పట్టణంలోని దేవిడి కాలనీకి చెందిన సునీతా (37) గత నెల 28న కుమారుడికి తాగించేందుకు పాలు వేడి చేస్తుండగా ప్రమాదవశాత్తు చీరకు నిప్పు అంటుకుంది. హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మరణించింది. మృతదేహానికి పంచనామా అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ బాల్‌రాజ్‌ తెలిపారు.

బావిలో పడి మహిళ మృతి

వీపనగండ్ల: మండలంలోని గోవర్ధనగిరి చెందిన సింగనమణి అంజనమ్మ (50) గ్రామ సమీపంలోని దిగుడుబావిలో జారిపడి మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం అంజనమ్మ కుమారుడు హైదరాబాద్‌లో కూలి పనిచేస్తుండగా.. ఆమె అక్కడే ఉండేది. రెండు రోజుల క్రితమే గ్రామానికి వచ్చింది. సోమవారం సాయంత్రం గ్రామ సమీపంలోని బావిలో ప్రమాదవశాత్తు కాలు జారి పడడంతో మృతి చెందింది. ఎస్‌ఐ రాణి ఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని వనపర్తి ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

విద్యుదాఘాతంతో యువకుడి దుర్మరణం

గోపాల్‌పేట: ప్రమాదవశాత్తు విద్యుత్‌ఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన మండల కేంద్రంలోని బండపల్లి కాలనీలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రంలోని వెంగలాయపల్లి అంజనమ్మ, వెంకటయ్య కుమారుడు బాబు ఆదివారం రాత్రి గొర్రెలు, మేకలు ఉండే రేకుల షెడ్డులో మంచంపై కూర్చొని కరెంటు ప్లగ్‌ పెట్టి స్విచ్‌ ఆన్‌ చేయడంతో కూర్చున్న చోటే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. యువకుడి మృతిపై ఎస్‌ఐ వేణుగోపాల్‌ను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు.

వ్యక్తి ఆత్మహత్య

ఆత్మకూర్‌: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసు కున్న ఘటన సోమవారం మండలంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ జయన్న కథనం ప్రకారం.. మండలంలోని పిన్నంచర్లకు చెందిన అంకె నాగన్న (48) భార్య పదేళ్ల క్రితం చనిపోగా .. ఉన్న ఒక్క కుమారుడు బతుకు దెరువు కోసం హైదరాబాద్‌ వెళ్లాడు. ఒంటరిగా జీవిస్తూ మానసిక వ్యాధితో బాధపడేవాడు. ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సోమవారం ఉదయం గమనించిన చుట్టు పక్కలవారు విషయాన్ని పోలీసులకు, కుమారుడికి తెలిపారు. కుమారుడు నరేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఆస్తి కోసం తోడల్లుడి హత్య

మహబూబ్‌నగర్‌ క్రైం: అత్తగారి ఆస్తులు తోడల్లుడికి చెందుతాయని అన్నాదమ్ములతో కలిసి తోడల్లుడిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. రూరల్‌ ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ కథనం ప్రకారం.. సీసీకుంట మండల కేంద్రానికి చెందిన నరేశ్‌(24) మహబూబ్‌నగర్‌ మండలంలోని మనికొండకు చెందిన శిరీషను ఏడాదిన్నర కిందట పెళ్లి చేసుకుని ఇళ్లరికం ఉంటున్నాడు. అత్తగారి ఆస్తి నరేశ్‌కు చెందుతాయని భావించిన తోడల్లుడు(సడ్డకుడు) శివకుమార్‌ కొంతకాలంగా నరేశ్‌తో గొడవలు పడుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి శివకుమార్‌తోపాటు అతని అన్నాదమ్ములైన శ్రావణ్‌, శరత్‌తో కలిసి నరేశ్‌ను తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత రోకలిబండతో తలపై విచక్షణా రహితంగా కొట్టి హత్య చేశారు. మృతుడి తల్లి మణెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.

జూరాలకు ఇన్‌ఫ్లో..

ధరూరు/ఆత్మకూర్‌: జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో స్వల్పంగా పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి 8 గంటల వరకు 21వేల క్యూసెక్కులు ఉండగా.. సోమవారం సాయంత్రం 7 గంటలకు 27, 200 క్యూసెక్కులకు పెరిగినట్లు అధికారులు తెలిపారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 30,681 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 71 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–1కు 650 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 640 క్యూ సెక్కులు, కుడి కాల్వకు 578 క్యూసెక్కులు కలిపి ప్రాజెక్టు నుంచి మొత్తం 32,815 క్యూసెక్కు ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

8 యూనిట్లలో విద్యుదుత్పత్తి

దిగువ, ఎగువ జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో 8 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపడుతున్నారు. ఎగువలో 4 యూనిట్ల ద్వారా 156 మెగావాట్లు, దిగువలో 4 యూనిట్ల ద్వా రా 160 మెగావాట్లు విద్యుదుత్పత్తి చేస్తున్నట్లు ఎస్‌ఈ శ్రీధర్‌, డీఈ పవన్‌కుమార్‌ తెలిపారు.

శ్రీశైలంలో నీటిమట్టం 883.6 అడుగులు

దోమలపెంట: శ్రీశైలం జలాశయంలో సోమ వారం నీటిమట్టం 883.6 అడుగుల వద్ద 20 7.8472 టీఎంసీల నీటి నిల్వ ఉంది. శ్రీశైలంలో భూగర్భ కేంద్రంలో 17.172 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులు, ఏపీ జెన్‌కో పరిధిలోని కుడిగ ట్టు కేంద్రంలో 6.69 మి.యూ. విద్యుదుత్పత్తి చేస్తూ 23,500 కలిపి మొత్తం 58,815 క్యూసెక్కులను సాగర్‌కు విడుదల చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement