సీఎం బందోబస్తుకు వెళ్తుండగా ప్రమాదం
అచ్చంపేట రూరల్: సీఎం రేవంత్‌రెడ్డి బందోబస్తు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులకు అచ్చిరావడం లేదు. సీఎం రేవంత్‌రెడ్డి అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి ఎస్‌ఎల్‌బీసీ సొరంగమార్గం సర్వే పనుల పరిశీలన సందర్భంగా బందోబస్తుకు వస్తున్న గద్వాల ఏఆర్ డీఎస్పీ నరేందర్‌రావు ప్రయాణిస్తున్న డిపార్టుమెంట్ ఇన్నోవా కారును మండలంలోని ఐనోల్ సమీపంలో ట్రాక్టర్ ఢీ కొట్టింది. ట్రాక్టర్ ఢీకొనడంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పొదలలోకి వెళ్లింది. ట్రాక్టర్ డ్రైవర్ బ్రేకులు వేయబోయి ఎక్సలేటర్‌ను తొక్కడంతో దాదాపు పది మీటర్ల దూరం వరకు కారు చెట్లపొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు కారులో డీఎస్పీతో పాటు డ్రైవర్ ఉన్నారు. ఎవరికి గాయాలు కాలేదు. డీఎస్పీ మరో కారులో విధులకు హాజరయ్యారు. అక్టోబర్ 2న దసరా వేడుకలకు సొంత గ్రామానికి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి బందోబస్తుకు వచ్చిన మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు వాహనం జడ్చర్ల సమీపంలోని గంగాపూర్ శివారులో ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో డీఎస్పీతో పాటు డ్రైవర్, గన్‌మెన్ గాయపడిన సంఘటన తెలిసిందే. సీఎం బందోబస్తు ఉమ్మడి జిల్లా పోలీసులకు అచ్చిరావడం లేదని చర్చించుకుంటున్నారు. ఈ సంఘటనపై సిద్దాపూర్ ఎస్‌ఐ పవన్‌కుమార్‌ను వివరణ కోరగా, ప్రస్తుతం ఎలాంటి ఫిర్యాదు అందలేదని, సీఎం బందోబస్తు షెడ్యూల్‌లో బిజీగా ఉన్నామని, సంఘటనా స్థలికి వెళ్లి పరిశీలిస్తామని తెలిపారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని, డీఎస్పీ వాహనం ముందుబాగం దెబ్బతిందని తెలిసిందన్నారు.


