భార్య మృతి కేసులో ఏడున్నరేళ్ల జైలుశిక్ష
గద్వాల క్రైం: అదనపు కట్నం వేధింపులతో భార్య మృతికి కారణమైన భర్తకు ఏడున్నరేళ్ల జైలుశిక్షతో పాటు రూ.3 వేలు జరిమానా విధిస్తూ జిల్లా సెషన్ కోర్టు జడ్జి ప్రేమలత సోమవారం తీర్పు వెల్లడించినట్లు కోర్టు పీపీ వినోదాచారి తెలిపారు. అలంపూర్ నియోజకవర్గంలోని సింగవరానికి చెందిన చాకలి హరికృష్ణ కర్నూలు జిల్లాకు చెందిన జూపల్లి మల్లి కా(రమ్య)ను 2022లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వివాహా సమయంలో కట్నం రూపేణా వరుడుకి 10 తులాల బంగారు ఆభరణాలు అందజేశారు. అయితే అదనపు కట్నం కోసం హరి కృష్ణ భార్యను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో భార్య తీవ్ర మనస్థాపం చెంది 19 మే 2023న నిప్పంటించుకుంది. స్థానికుల చికిత్స నిమిత్తం కర్నూలు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రమ్య మృతి చెందింది. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులు అలంపూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టి హరికృష్ణపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు చార్జ్‌షీట్ దాఖాలు చేసి సోమవారం కోర్టులో హాజరు పర్చగా జడ్జి తీర్పు వెల్లడించిందన్నారు. నిందితుడిని పోలీసులు మహబూబ్‌నగర్ జిల్లా జైలుకు తరలించారు. కేసులో ముగింపులో పనిచేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు.
రూ. 3వేలు జరిమానా
విధించిన జడ్జి ప్రేమలత
అదనపు కట్నం కోసం వేధింపుల నేపథ్యంలో మహిళ ఆత్మహత్య చేసుకున్న వైనం


