జిల్లాకేంద్రంలో అధ్వాన స్థితిలో పాటుకాల్వలు, పెద్దనాలాల
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలో భారీ వర్షం కురిసి నాలుగు రోజులైనా పాటు కాల్వలు, పెద్ద నాలాలు పొంగి పొర్లుతూనే ఉన్నాయి. సుమారు 45 రోజుల క్రితమే కొత్తగంజి సమీపంలోని కొత్త చెరువు, న్యూమోతీనగర్– ప్రేమ్‌నగర్ మధ్యలోని గాండ్లోని చెరువు, శ్రీనివాసకాలనీలోని పాలకొండ చెరువు, పాలకొండలోని ఊరచెరువు, అప్పన్నపల్లిలోని గంగోసుకుంట నిండి అలుగులు పారాయి. ఈ సీజన్ ఆరంభంలోనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మినీ ట్యాంకుబండ్ (పెద్దచెరువు), ఎర్రకుంట, ఇమాంసాబ్‌కుంట తూములను నీటి పారుదల శాఖ అధికారులు తెరిచి ఉంచారు. ఈ క్రమంలోనే భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి నగరంలోని లోతట్టు ప్రాంత ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవనం సాగించే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పాటు కాల్వలు, పెద్దనాలాలు సుమారు 8 కి.మీ., వరకు విస్తరించి ఉండగా చాలాచోట్ల అధ్వాన స్థితికి చేరాయి. ఇళ్ల మధ్యలో నుంచి ఇవి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
శాశ్వత నివారణ చర్యలేవి?
లోతట్టు ప్రాంతాలు ముంపు బారిన పడకుండా శాశ్వత చర్యలు తీసుకోవడంలో సంబంధిత అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. వాస్తవానికి రెండేళ్ల క్రితం పెద్దచెరువు (మినీ ట్యాంక్ బండ్) కింద ఒకవైపు తూము నుంచి షాషాబ్‌గుట్ట– బీకేరెడ్డికాలనీలో, రెండోవైపు రామయ్యబౌలి అలుగు నుంచి మొత్తం కిలోమీటరు మేర వరద కాల్వ నిర్మించాలని నిర్ణయించారు. అయితే ఇప్పటి వరకు 600 మీటర్లే పూర్తి చేశారు. ఇదిలా ఉండగా.. కేంద్ర ప్రభుత్వం అమృత్–2 కింద సీవరేజీ ప్రాజెక్టు కింద 2023లో రూ.276.80 కోట్లు కేటాయించింది. ఏడాదిన్నర క్రితమే టెండర్లు పూర్తయినా ఇప్పటి వరకు ఎస్‌టీపీ లు కాని, పాటుకాల్వలు, పెద్దనాలాలు (ఐఎన్‌డీ స్ట్రక్చర్ డ్రెయిన్స్) కాని పటిష్టం చేయడానికి పనులు ప్రారంభించకపోవడం గమనార్హం. ఇక అభివృద్ధి పనుల్లో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇటీవల వివిధ చోట్ల సీసీరోడ్లు, డ్రెయినేజీలను మాత్రమే నిర్మించి.. పాటుకాల్వలు, పెద్దనాలా ల జోలికి మాత్రం వెళ్లలేదు. దీంతో నగరంలో ఏటా ముంపు ప్రాంతాలు జలమయమవుతున్నాయి.
నాలుగు రోజులైనా తగ్గని వరద ఉధృతి
ఆందోళనలో లోతట్టు ప్రాంత ప్రజలు
నగరంలోని ఆర్‌యూబీల
వద్ద నిలిచిన రాకపోకలు
భారీ వర్షం కురిసిన
ప్రతిసారి ఇదే పరిస్థితి


