బందోబస్తు పర్యవేక్షణ పెంచాలి
● మప్టీలో ఉండే సిబ్బంది అప్రమత్తంగా గస్తీ నిర్వహించాలి
● ఎస్పీ డి.జానకి
మహబూబ్‌నగర్ క్రైం: కురుమూర్తి జాతరలో సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ వ్యూ, మ్యాన్‌ప్యాక్ ద్వారా బందోబస్తుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ డి.జానకి పోలీస్ అధికారులను ఆదేశించారు. బందోబస్తు ఏర్పాట్లను మంగళవారం ఎస్పీ పరిశీలిస్తూ చిన్న వడ్డెమాన్ నుంచి ప్రారంభమైన ఉద్దాల కార్యక్రమంలో భాగంగా కురుమూర్తి వరకు బందోబస్తు పర్యవేక్షణ చేయడం జరిగింది. భక్తుల రాకపోకలు, ట్రాఫిక్, పార్కింగ్, మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఇతర అంశాలను పరిశీలించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం పనితీరు తనిఖీ చేశారు. జాతర వాహనాలు ఎక్కడా అడ్డంగా ఉండకుండా పార్కింగ్ ప్రాంతాలను స్పష్టంగా గుర్తించి అక్కడే పార్క్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా భక్తులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో మహిళా కానిస్టేబుళ్లు విధుల్లో ఉండాలన్నారు. లాస్ట్, ఫౌండ్ కౌంటర్, హెల్ప్‌డెస్క్‌లను ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంచి భక్తులకు సహాయం చేయాలన్నారు. మప్టీలో ఉన్న సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని, జాతరకు వచ్చే భక్తులు సురక్షితంగా, సౌకర్యంగా దర్శనం చేసుకోవాడానికి వీలు కల్పించే విధంగా ఉండాలన్నారు. ఈ తనిఖీల్లో డీఎస్పీలు వెంకటేశ్వర్లు, గిరిబాబు, సీఐ రామకృష్ణ పాల్గొన్నారు.
జాతరలో జేబుదొంగల చేతివాటం
మంగళవారం జేబు దొంగాల ముఠాలు విజృంభించాయి. ఉద్దాల రద్దీ దగ్గరతోపాటు క్యూలైన్‌లలో, జాతరలో చేతివాటం ప్రదర్శించి భారీగా జేబు కత్తరించి నగదు అపహరించారు. లాల్‌కోట్ గ్రామానికి చెందిన నర్సింహులు అనే వ్యక్తి జేబులో నుంచి రూ.10వేల నగదు అపహరించారు. అదేవిధంగా దేవరకద్రకు చెందిన లలిత, ఆత్మకూర్‌కు చెందిన నాగమల్లిక అనే మహిళల బ్యాగ్‌లను అపహరించారు. జాతర రద్దీగా ఉండడంతో ప్రత్యేకంగా వచ్చిన దొంగల ముఠాలు జేబు దొంగతనాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. కొద్దిగా ఏమరపాటు ఉన్నవాళ్లను లక్ష్యంగా చేసుకుని కాజేస్తున్నారు.


