ఐకానిక్ వంతెన నిర్మాణ స్థల పరిశీలన
కొల్లాపూర్ రూరల్: మండలంలోని సోమశిల సమీపంలో ఫారెస్టు పరిధిలో ఉన్న ప్రతిపాదిత సోమశిల ఐకానిక్ బ్రిడ్జి స్థలాన్ని అమ్రాబాద్ టైగర్ రిజర్వు చీఫ్ ఫారెస్టు ఫీల్డు డైరెక్టర్ సునీల్ హెరేమత్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సోమశిల ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా కొల్లాపూర్ రిజర్వు ఫారెస్టు గుండా వెళ్తున్న ఎన్‌హెచ్–167 రహదారి మార్గాన్ని సందర్శించారు. ఆ రహదారి మార్గంలో అటవీ సిబ్బంది ద్వారా నిర్వహించబడుతున్న చెట్ల గణనను తనిఖీ చేశారు. సిబ్బంది నిర్వహించిన చెట్లు, గణించిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రిజర్వు ఫారెస్టులో రహదారి వెళ్తున్న మార్గాన్ని కచ్చితంగా గుర్తించి అక్కడ పిల్లర్ నిర్మించాలని అటవీశాఖ సిబ్బంది, జాతీయ రహదారి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్ గోపిడి, మండలాధికారి చంద్రశేఖర్, ఫ్లయింగ్ స్క్వాడ్ రామ్మోహన్, కొల్లాపూర్ క్షేత్రస్థాయి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


