
వేలూరు రైల్వేస్టేషన్‌లో గట్టువాసులు
గట్టు: మండలానికి చెందిన మూగవారు తప్పిపోయి తమిళనాడులోని వేలూరు రైల్వేస్టేషన్‌లో ప్రత్యక్షమయ్యారు. ఈ ప్రాంతానికి చెందిన ఓ దివ్యాంగుడు, మహిళ, ఇద్దరు పిల్లలను వేలూరులో రైల్వే పోలీసులు గుర్తించి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారని.. ఏ ప్రాంతం వారని ఆరా తీసినట్లు సమాచారం. వారంతా మూగవారు కావడంతో అతికష్టం మీద వారి వివరాలను రైల్వే పోలీసులు గుర్తించే ప్రయత్నం చేశారు. అయితే తమది జోగుళాంబ గద్వాల జిల్లాలోని గట్టు ప్రాంతమని పేపర్‌పై రాసి ఇవ్వడంతో.. రైల్వే పోలీసులు శనివారం గద్వాల ఆర్డీఓకు సమాచారం అందించారు. ఈ మేరకు వేలూరు రైల్వే స్టేషన్‌లో కనిపించిన వారి ఫొటోలను గట్టు తహసీల్దార్ విజయ్‌కుమార్‌కు పంపించి.. గుర్తించాల్సిందిగా చెప్పారు. రెవెన్యూ అధికారులు సామాజిక మాధ్యమాలతో పాటు వివిధ గ్రామాలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులకు వీరి ఫొటోలను ఫార్వర్డ్ చేశారు. వారు ఎవరనే విషయాన్ని తెలియజేయాలని అభ్యర్థించారు.