
కురుమూర్తి ఉత్సవాలకు ఏర్పాట్లు
● ఆలయ పరిసరాల్లో పనుల ముమ్మరం
● పూర్తిదశకు చేరుకున్న రంగులు అద్దడం
● మంచినీరు, పారిశుద్ధ్యంపైప్రత్యేక దృష్టి
చిన్నచింతకుంట: కాంచన గుహలో కొలువుదీరిన కురుమూర్తి స్వామి బహ్మోత్సవాలు, జాతర ఈనెల 22 అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. అందుకు ఆలయం వద్ద వివిధ పనులు చేపట్టారు. పనులను పూర్తి చేసేందుకు రెండుమూడు రోజులుగా పనులను ముమ్మరంగా చేస్తున్నారు. ముఖ్యంగా అధికారులు పారిశుద్ధ్యం, మంచినీరు, ట్రాఫక్ నియంత్రణ, పార్కింగ్, ప్రయాణ సౌకర్యాలు, వైద్యం, నిఘా ఏర్పాట్లపై దృష్టిసారించి అందుకనుగుణంగా పనులు చేపడుతున్నారు. అయితే ఇప్పటికే రంగులు అద్దే పనులు పూర్తి దశకు చేరుకోగా.. పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. జాతర మైదానంలోని డ్రైనేజీల్లో జేసీబీల ద్వారా మురుగు, పిచ్చిమొక్కలను తొలగించారు. అన్నదాన సత్రం, కోనేరు వద్ద మరుగు దొడ్లు, మూత్రశాలలు, స్నానపుగదుల మరమ్మతులు చేపట్టారు. మంచినీటికి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేదుకు తగు చర్యలు చేపడుతున్నారు.
భక్తుల ప్రయాణానికి బస్‌స్టాప్‌ల ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణకు బారికేడ్లు, సీసీ కెమెరాలు, వైద్య, ఆరోగ్య కేంద్రాలకు ఏర్పాట్లు చేయాల్సి ఉంది. అందుకు ఆయా ప్రదేశాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టి చదును చేయాల్సి ఉంది. జాతర మైదానంలోని పలుచోట్ల నీటిగుంతలు పూడ్చాల్సి ఉంది. కొన్నిచోట్ల ఉన్న మరుగుదొడ్ల మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. వాటికి ట్యాపులు బిగించాల్సి ఉంది. అయితే ఇంకా చేపట్టాల్సిన పనులను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. త్వరలోనే పనులు ప్రారంభించి పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
చేపట్టాల్సిన పనులు
పనులు పూర్తి చేస్తాం
స్వామివారి బ్రహ్మోత్సవాల సమయానికి అన్ని పనులు పూర్తి చేస్తాం. ఇప్పటికే ఆలయం వద్ద రంగులు అద్దే పనులు పూర్తి చేశాం. ఆలయ ప్రాంగణం, మెట్ల ప్రాంగణంలో పారిశుద్ధ్య పనులు చేపట్టి శుభ్రపరిచాం. జాతర మైదానంలో చేయాల్సిన పనులు చేపట్టి త్వరగా పూర్తి చేస్తాం.
– మధనేశ్వరెడ్డి,
ఈఓ, కురుమూర్తిస్వామి ఆలయం
ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు
కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు, జాతర ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఇప్పటికే ఆలయం వద్ద వివిధ పనులు చేపట్టాం. ముఖ్యంగా మంచినీటి వసతి, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నింత్రణపై దృష్టిసారించి చర్యలు చేపడుతాం. బ్రహ్మోత్సవాల సమయానికి అన్ని పనులు పూర్తి చేస్తాం.
– గోవర్ధన్‌రెడ్డి, చైర్మన్,
కురుమూర్తి స్వామి ఆలయం

కురుమూర్తి ఉత్సవాలకు ఏర్పాట్లు