
నెట్టెంపాడు కాల్వలో పడిన యువకుడు
ధరూరు: పొట్ట కూటి కోసం జాతరలో సర్కస్ చేసేందుకు వచ్చిన ఓ యువకుడు ప్రమాదశాత్తు నెట్టెంపాడు కాల్వలో పడి ప్రాణాలతో బయటపడిన ఘటన మండలంలోని గుడ్డెందొడ్డి శివారులో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేటీదొడ్డి మండలంలోని పాగుంట లక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో సర్కస్ వేసేందుకు వచ్చిన కర్ణాటకలోని బీజాపూర్‌కు చెందిన తనాజీ అనే 25 ఏళ్ల యువకుడు వచ్చాడు. అతడు శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో మండలంలోని గుడ్డెందొడ్డి శివారులోని నెట్టెంపాడు ప్రధాన కాలువలో చేపల పట్టేందుకు వెళ్లాడు. పంప్‌హౌస్ సమీపంలోనే కాల్వ లోతుగా ఉందని తెలియని ఆ యువకుడు కాల్వలోకి దిగి జారిపడిపోయాడు. అక్కడే ఉన్న వారి బంధువైన మరో యువకుడు గట్టిగా కేకలు వేయడంతో చుట్టు పక్కల రైతులు, అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి ముందుగా రేవులపల్లి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఫైర్ సిబ్బంది, రెస్క్యూ టీం సిబ్బందికి విషయం తెలిపారు. అందరూ కలిసి గంట పాటు శ్రమించి ఆ యువకుడిని తాళ్లు, నిచ్చెన సహాయంతో బయటకు తీశారు. ప్రాణాలకు తెగించి ఓ నిండు ప్రాణానాన్ని కాపాడిన ఎస్ శ్రీహరి, గద్వాల ఫైర్ స్టేషన్ ఎస్‌ఐ రాకేష్, పోలీసులను గుడ్డెందొడ్డి మాజీ సర్పంచు రఘువర్ధన్‌రెడ్డి, సామాజిక కార్యకర్త అంజి సాగర్ శాలువాలతో సన్మానించారు. 10 అడుగుల దూరంలోనే పంప్ హౌస్ మోటారు రన్నింగ్‌లో ఉండడంతో అందులోకి జారుకునే ప్రమాదం ఉందని, పోలీసులు సమయానికి వచ్చి ప్రాణాలను కాపాడారని గుడ్డెందిడ్డి గ్రామస్తులు తెలిపారు. బాధితుడికి తల, చేతికి గాయాలవడంతో చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో గద్వాల ఆస్పత్రికి తరలించారు.