
దీపావళికై నా వేతనాలు ఇవ్వండి
జడ్చర్ల టౌన్: ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్మికులకు దసరా పండగకు ఎలాగూ వేతనాలు ఇవ్వలేదు.. కనీసం దీపావళికై నా ఇవ్వండంటూ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి సురేశ్ డిమాండ్ చేశారు. బుధవారం జడ్చర్ల ఏరియా ఆస్పత్రిలో కార్మికులతో సమావేశం నిర్వహించారు. దసరా పండగకు ముందే నాలుగు నెలల వేతన బడ్జెట్ విడుదలైనప్పటికి శ్రీశాంతి ఏజెన్సీ నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఇప్పటికీ వేతనాలు అందడంలేదని ఆరోపించారు. గత శుక్రవారం చేసిన మెరుపు సమ్మెకు ఆస్పత్రి సూపరింటెండెంట్ దిగివచ్చి ఐదురోజుల్లో వేతనాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చి నేటికీ నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరో మూడురోజుల్లో దీపావళి పండగ వస్తుందని, అందరి జీవితాల్లో వెలుగులున్నా.. ఆస్పత్రి కార్మికుల జీవితాల్లో చీకట్లు అలుముకున్నాయన్నారు. వెంటనే ఏజెన్సీ నిర్వాహకులపై చర్యలు తీసుకుని వేతనాలు ఇచ్చేలా చూడాలన్నారు. లేదంటే నిరవధిక సమ్మెకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆస్పత్రి యూనియన్ అధ్యక్షుడు నర్సింహులు, కార్మికులు నవీన్, శేఖర్, రవీందర్, రామకృష్ణ, విజయలక్ష్మి, మనెమ్మ, శివలీల, పద్మ, సుక్కమ్మ, అలివేల, భార్గవి, నీరజ, అంజలి, నర్సమ్మ, స్వామి, భాగ్యమ్మ పాల్గొన్నారు.