
హైవేపై దారి మళ్లింపు
● కర్నూలులో ప్రధాని మోదీ పర్యటన
● తెలంగాణ సరిహద్దులో ట్రాఫిక్ ఆంక్షలు
● జాతీయరహదారిపై నిలిచిన వాహనాలు
● దారి మళ్లించే ప్రాంతాల్లో ఏపీ పోలీసులు
అలంపూర్/మానవపాడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లాలో గురువారం ప్రధాని మోదీ పర్యటన కారణంగా జాతీయ రహదారి నుంచి ప్రత్యామ్నాయ మార్గాలకు వాహనాలను మళ్లించారు. పోలీసులు సూచించిన రోడ్డు మార్గాల ద్వారా వాహనదారులు తమ గమ్యస్థానాలకు తరలివెళ్లారు. కర్నూల్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేయడంతో పాటు ప్రధాని భారీ బహిరంగ సభలో పాల్గొనందున అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో సరిహద్దు ప్రాంతమైన అలంపూర్ నియోజకవర్గంలో ఈ పరిస్థితి రోజంతా కొనసాగింది. దీంతో అలంపూర్, అలంపూర్ చౌరస్తా, శాంతినగర్, అయిజ వంటి ప్రాంతాలు వాహనాలతో రద్దీగా మారాయి. అలంపూర్ సీఐ రవిబాబు, ఉండవెల్లి ఎస్‌ఐ శేఖర్, అలంపూర్ ఎస్‌ఐ వెంకటస్వామి ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలను దారి మళ్లించి, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించారు. అలంపూర్ చౌరస్తాలోని జాతీయ రహదారి ఫ్లైఓవర్ వద్ద ఏపీకి చెందిన సీఐ, పోలీసులు సైతం ట్రాఫిక్ మళ్లింపులో భాగస్వాములయ్యారు. ఉదయం నుంచి ఒక్కసారిగా వచ్చిన వాహనాలతో ఫ్లైఓవర్, జాతీయ రహదారిలో రద్దీ ఏర్పడింది. వాహనదారులు ఇబ్బందులు పడకుండా దారి మళ్లించే ప్రదే శాల్లో ఆయా ప్రాంతాల పేర్లు, గుర్తులతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే మొదట్లో ఏపీ పోలీసులు లారీ వంటి వాహనాలతో పాటు కార్లను సైతం దారి మళ్లించారు. దీంతో జాతీయరహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. సీఐ రవిబాబు ఇక్కడికి చేరుకోని కార్ల లాంటి చిన్న వాహనాలను నేరుగా జాతీయరహదారి గుండా వెళ్లడానికి అవకా శం కల్పించారు. దీంతో ట్రాఫిక్ సమస్య సద్దుమణిగింది.
భారీ వాహనాల నిలిపివేత
కర్నూల్ జిల్లాలోని నన్నూరులో ప్రధాని భారీ బహిరంగ సభ నేపథ్యంలో మానవపాడు స్టేజీ సమీపంలో జాతీయ రహదారి–44పై భారీ వాహనాలను పోలీసులు నిలిపివేశారు. దీంతో బెంగుళూరు, అనంతపురం, హిందూపురం, పుట్టపర్తికి వెళ్లే వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు.

హైవేపై దారి మళ్లింపు