
చెంచుల అభ్యున్నతికి పథకాలు
● క్షయ రహిత దేశంగా తీర్చిదిద్దడంలో కళాకారులు, రచయితలుభాగస్వాములు కావాలి
● గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఆదివాసీ చెంచుల సమగ్ర, సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు జిల్లాలో ఉన్న 1,441 మంది లబ్ధిదారులకు చేరాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కోరారు. గురువారం మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అధికారులు, వివిధ రంగాల ప్రముఖులతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వయం ఉపాధి, సౌర విద్యుత్, పక్కా ఇళ్లు, విద్య తదితర పథకాలు చెంచులకు అందేలా చూడాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో క్షయ పరీక్షలు నిర్వహించి వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం అందించాలని, క్షయ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. సామాజిక కార్యకర్తలు, ప్రముఖులు, రచయితలు, కవులు, కళాకారులు వీధి నాటకాలు, జానపద గేయాలు, రచనలతో మూడ నమ్మకాలు, సామాజిక రుగ్మతలను పారద్రోలడానికి తమవంతు కృషి చేయాలన్నారు. చెంచులు, ఆదివాసీ మహిళలను మహిళా సంఘాల్లో చేర్చుకొని వారి ఆర్థిక స్వావలంబనకు తోడ్పడాలని కోరారు. అంతకుముందు కలెక్టర్ విజయేందిర బోయి మహబూబ్‌నగర్ జిల్లా విశిష్టత, ప్రముఖ పర్యాటక స్థలాలు, విద్య, వెద్యం, వివిధ శాఖల్లో సాధించిన అభివృద్ధిని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. విద్య, వైద్యం, క్రీడలు, రచనలు, సేంద్రియ సాగు, సామాజిక సేవ తదితర రంగాల్లోని 16 మంది ప్రముఖులు ఆయా రంగాల్లో చేసిన సేవలను తెలియజేశారు.
మొక్క నాటిన గవర్నర్..
కలెక్టరేట్ ఆవరణలో గవర్నర్ మొక్కనాటి నీరు పోశారు. పచ్చదనంతో పర్యావరణానికి మేలు చేకూరుతుందని.. మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ దానకిషోర్, డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్, ఎస్పీ డి.జానకి వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
గవర్నర్‌కు ఘన స్వాగతం..
కలెక్టరేట్‌కు చేరుకున్న గవర్నర్‌కు కలెక్టర్ విజయేందిర బోయి, అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మధుసూదన్‌నాయక్ స్వాగతం పలకగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన అనంతరం గ్రామీణాభివృద్ధి, వైద్య, మెప్మా, రెడ్‌క్రాస్ సొసైటీ, మహిళా, శిశుసంక్షేమ తదితర శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను గవర్నర్ తిలకించారు. చెంచుల ఆరోగ్య పరీక్షల నిర్వహణకుగాను ప్రధానమంత్రి జన్‌జాతి ఆదివాసీ న్యాయమహా అభియాన్ కింద సంచార వైద్య వాహనాన్ని గవర్నర్ జెండా ఊపి ప్రారంభించారు.