
రాజ్యాధికారం కోసం బీసీలు ఏకమవ్వాలి
● టీఆర్‌పీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న
మెట్టుగడ్డ: రాష్ట్రంలో రాజ్యాధికారం కోసం బీసీలంతా ఏకమవ్వాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్‌పీ) అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్ ఏనుగొండలో జరిగిన బీసీ జేఏసీ సామాజిక తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో బీసీ కార్యకర్తల ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మల్లన్న మాట్లాడుతూ 42 శాతం రిజర్వేషన్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసి బీసీ సంక్షేమానికి కృషి చేయాలని ఆయన కోరారు. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకునేందుకు చూస్తున్నారే గానీ.. చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యంపై మొండిచేయి చూపిస్తున్నారని విమర్శించారు. ఇంటలెక్షన్ ఫోరంలో వక్తల ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. విద్య, వైద్యం, వలసలు, ఉపాధి, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు బీసీల అస్థిత్వం అని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేయాలన్నారు. కార్యక్రమంలో టీఆర్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిశంకర్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జానయ్య, సూర్యారావు, బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌సాగర్, బెక్కెం జనార్దన్, సారంగి లక్ష్మికాంత్, కోరమోని వెంకటయ్య, విజయ్‌కుమార్, వెంకటయ్య, నిర్మల, వివిధ కుల సంఘాల నాయకులు, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.