
అంచెలంచెలుగా ఎదుగుతూ.. విశిష్ట సేవలందిస్తూ..
నవాబుపేట మండలం గురుకుంట గ్రామానికి చెందిన సత్యనారాయణ రెడ్డి ఓయూ నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్‌డీ సాధించారు. రసాయన శాస్త్రవేత్తగా ప్రస్థానం ప్రారంభించి.. 2003లో ఎంఎస్‌ఎన్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను స్థాపించారు. అనతికాలంలోనే ఎంఎస్‌ఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు నెలకొల్పారు. చైర్మన్, ఎండీగా వ్యవహరిస్తూ 27 ప్రపంచ స్థాయి ఉత్పత్తి కేంద్రాలు, 400కు పైగా డోసేజ్ ఫార్ములేషన్లు, వెయ్యికి పైగా జాతీయ, అంతర్జాతీయ పేటెంట్లతో సంస్థ వృద్ధికి కృషిచేశారు. వందకు పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. పాలమూరు జిల్లా నుంచి ఇప్పటివరకు సుమారు ఐదు వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించడంతోపాటు హృద్రోగ, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల శస్త్ర చికిత్సలకు ఆయన సహకారం అందించారు. ఈ సేవలకు గుర్తింపుగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్ స్టడీస్ నుంచి ఆయన గతంలోనే ప్రతిష్టాత్మకమైన ఉద్యోగ రతన్ పురస్కారం అందుకున్నారు. తాజాగా పీయూ నుంచి గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించడం గర్వంగా ఉందని, నా వంతుగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేలా ముందుకు సాగుతానని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.