
స్నాతకోత్సవానికి వేళాయె
ఒకప్పుడు ఓయూ అనుబంధ పీజీ సెంటర్‌తో ప్రారంభమై.. అనంతరం యూనివర్సిటీగా ఏర్పడి.. సకల సౌకర్యాలు కల్పించడంతో పాటు పరిశోధనలకు ఊతమిస్తూ.. వేలాది మంది విద్యార్థుల ఉన్నత విద్యకు బాటలు వేసింది పాలమూరు యూనివర్సిటీ. మొదట సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలలతో ప్రారంభమైనా క్రమంగా ఉపాధి, ఉద్యోగ కోర్సులైన ఇంజినీరింగ్, లా కళాశాలల ఏర్పాటుతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. తాజాగా పీయూ పరిధిలో 160 కళాశాలలు ఉండగా.. 42,554 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఈక్రమంలో గురువారం జరిగే నాలుగో స్నాతకోత్సవానికి పీయూ ముస్తాబైంది.
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ (పీయూ) నాలుగో స్నాతకోత్సవానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. గురువారం జరిగే కార్యక్రమానికి పీయూలోని లైబ్రరీ ఆడిటోరియం వేదిక కానుంది. ముఖ్య అతిథిగా గవర్నర్, యూనివర్సిటీ చాన్స్‌లర్ జిష్ణుదేవ్ వర్మ హాజరుకానున్నారు. మొదటగా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్‌తో సమావేశం.. ఆ తర్వాత స్నాతకోత్సవం నిర్వహించనున్నారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్, వివిధ డిపార్ట్‌మెంట్ల డీన్స్, గోల్డ్‌మెడల్స్ తీసుకునే విద్యార్థులు, పీహెచ్‌డీ పట్టాలు అందుకునే స్కాలర్స్, వారి తల్లిదండ్రులు పాల్గొననున్నారు. పీయూ చరిత్రలో మొదటిసారిగా సామాజిక విభాగంలో విశిష్ట సేవలందిస్తున్న ఎంఎస్‌ఎన్ అధినేత, పారిశ్రామికవేత్త మన్నె సత్యనారాయణరెడ్డికి గౌరవ డాక్టరేట్‌ను అందజేయనున్నారు.
అంచెలంచెలుగా ఎదుగుతూ..
పీయూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిచేందుకు ఎంతో కృషి చేస్తుంది. కేవలం ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధ పీజీ సెంటర్‌తో ప్రారంభభమై.. 2008లో పూర్తిస్థాయి యూనివర్సిటీగా ఏర్పడింది. ప్రారంభంలో అడ్మినిస్ట్రేషన్ పరమైన అంశాలన్ని కూడా పీయూలో ప్రస్తుతం ఉన్న పీజీ కళాశాలలో జరిగేవి. 2010–11లో అడ్మినిస్ట్రేషన్ భవనం నిర్మించిన తర్వాత అక్కడికి బదిలీ చేశారు. 2018–19 ఎగ్జిమినేషన్ బ్రాంచ్‌ను రూ.10 కోట్లతో నిర్మించడంతో అక్కడికి ప్రత్యేకంగా బ్రాంచ్‌ను ఏర్పాటు చేశారు. పీయూ రక్షణ కోసం 3.1 ఎకరాల పొడువు గోడను 2020లో అధికారులు నిర్మించారు. సువిశాల పీయూ క్యాంపస్, కార్యాలయాలు, హాస్టళ్లు, కళాశాలల పర్యవేక్షణ కోసం 152 సీసీ కెమెరాలతో 24 గంటలు పర్యవేక్షణ చేస్తున్నారు.
ఉన్నత విద్య చేరువ..
గద్వాల, వనపర్తి, కొల్లాపూర్‌లో పీజీ సెంటర్‌లు ఏర్పాటు చేసి వేలాది మంది విద్యార్థులకు పీజీ స్థాయి విద్యను అందిస్తుంది. ఇందులో ప్రస్తుతం ప్రొఫెషనల్, ట్రెడీషనల్ కోర్సులు కలిపి 19 కోర్సులకు తోడుగా ఇంజినీరింగ్, లా కళాశాలలు కూడా ప్రారంభం కావడంతో దీని ప్రాధాన్యత మరింత పెరిగింది. ప్రస్తుతం పీయూలో మొత్తం రెండు బాలుర హాస్టల్స్, రెండు బాలికల హాస్టల్స్ ఉండగా ఇందులో 1320 మంది విద్యార్థులు ఉంటున్నారు.
నేడు పీయూకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాక
నాలుగోసారి వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు
ఎంఎస్‌ఎన్‌రెడ్డికి గౌరవ డాక్టరేట్..
83 మంది విద్యార్థులకు బంగారు పతకాలు.. 12 మందికి పీహెచ్‌డీ పట్టాల ప్రదానం
ఏర్పాట్లు పూర్తి చేశాం..
స్నాతకోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. గురువారం ఉదయం 11 గంటలకు లైబ్రరీ ఆడిటోరియం వేదికగా జరిగే కార్యక్రమానికి గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ప్రొటోకాల్ ప్రకారం వివిధ డిపార్ట్‌మెంట్ అధికారుల సహకారంతో ఏర్పాట్లు చేశాం. కార్యక్రమంలో ఎంఎస్‌ఎన్‌రెడ్డి గౌరవ డాక్టరేట్, 83 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 12 మందికి పీహెచ్‌డీ పట్టాలు అందుకోనున్నారు.
– జీఎన్ శ్రీనివాస్, వీసీ పీయూ

స్నాతకోత్సవానికి వేళాయె

స్నాతకోత్సవానికి వేళాయె