
నిఘా నీడలో పీయూ
● 344మంది పోలీసులతోప్రత్యేక బందోబస్తు
● ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ డి.జానకి
మహబూబ్‌నగర్ క్రైం: పాలమూరు యూనివర్సిటీలో గురువారం గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ పర్యటన సందర్భంగా ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ డి.జానకి వెల్లడించారు. పీయూలో బందోబస్తు ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ ఆంక్షలపై ట్రయల్‌ను పరిశీలించారు. పీయూతో పాటు కలెక్టరేట్‌లో సైతం భద్రత ఏర్పాట్లు చేశారు. పీయూ పరిసర ప్రాంతాల ఇప్పటికే పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ప్రత్యేక బలగాలు బుధవారం నుంచి పీయూలో విధుల్లో ఉన్నారు. గవర్నర్ పర్యటన పూర్తి అయ్యే వరకు ప్రత్యేక ఆంక్షలు కొనసాగనున్నాయి. 344 మంది పోలీసుల బలగాలతో ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఒక ఎస్పీ, ఒక ఏఎస్పీ, నలుగురు డీఎస్పీలు, పది మంది సీఐలు, 28 మంది ఎస్‌ఐలు, 90 మంది ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 210 మంది కానిస్టేబుళ్లు, హోంగార్డులు గవర్నర్ బందోబస్తులో ఉండనున్నారు. జిల్లా కేంద్రంలోని హైటెక్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన బందోబస్తు కేటాయింపులలో పోలీస్ అధికారులకు ఎస్పీ సూచనలు చేశారు. సూచనలు ఇవ్వడం జరిగింది. గవర్నర్ పర్యటన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి అధికారికి అప్పగించిన బాధ్యత నిబద్ధతతో పూర్తి చేయాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల రాకపోకలు, పార్కింగ్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆమె వెంట ఏఎస్పీలు ఎన్‌బీ రత్నం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్‌బీ డీఎస్పీ రమణారెడ్డి, డీటీసీ డీఎస్పీ గిరిబాబు, సీఐలు గాంధీనాయక్, అప్పయ్య, ఇజాజుద్దీన్, భగవంత్‌రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.