
పోలీసుల డేగ కన్నుల్లో నల్లమల
● ప్రధాని పర్యటన నేపథ్యంలో
విస్తృత తనిఖీలు
● శ్రీశైలం పరిసర ప్రాంతాలను
జల్లెడ పడుతున్న స్పెషల్ పార్టీ పోలీసులు
● గురువారం మధ్యాహ్నం వరకు
ట్రాఫిక్ ఆంక్షలు
దోమలపెంట: శ్రీశైలంలో మల్లికార్జునస్వామి, అమ్మవార్ల దర్శనానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం పోలీసులు మంగళవారం నుంచే సరిహద్దు ప్రాంతాలు లింగాలగట్టు, సున్నిపెంట, శ్రీశైలంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆయా ప్రాంతాల్లో వ్యాపార సంస్థలు ఇతరత్రా అన్నింటిని మూయించారు. దీంతో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రధాని శ్రీశైలం పర్యటనలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతం నుంచి శ్రీశైలానికి వచ్చే వాహనాలన్నింటినీ దోమలపెంట, ఈగలపెంటలోని జెన్‌కో గ్రౌండ్‌లో నిలిపివేయనున్నారు. ఈ మేరకు ట్రాఫిక్ ఆంక్షల ఉత్తర్వులు పోలీస్ ఉన్నతాధికారుల నుంచి అందినట్లు ఈగలపెంట ఎస్‌ఐ జయన్న తెలిపారు. ఇదిలా ఉండగా నల్లమల ప్రాంతం అంతా పోలీసుల డేగ కన్నుల్లో ఉంది. మరో పక్కన శ్రీశైలం పరిసర ప్రాంతాలన్నింటిని స్పెషల్ పార్టీ పోలీసులు జల్లెడ వేస్తున్నారు. ఇప్పటికే ఎన్‌ఎస్‌జీ దళాలు శ్రీశైలానికి చేరుకున్నాయి. శ్రీశైలం పరిసర ప్రాంతాలు హైఅలర్ట్‌లో ఉన్నాయి. గురువారం ఆర్టీసీ బస్సులను సైతం ఈగలపెంటలో ఆపివేయనున్నారు. శ్రీశైలంలో ప్రధాని పర్యటన అనంతరం ఆర్టీసీ సర్వీసులు, ఇతర వాహనాల రాకపోకలకు అనుమతిస్తారు. గురువారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.