
గవర్నర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం జిల్లా పర్యటనకు వస్తున్నందున అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ హాల్‌లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ గురువారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పీయూ స్నాతకోత్సవంలో పాల్గొంటారన్నారు. అనంతరం మద్యాహ్నం 2.10 నుంచి 2.45 వరకు కలెక్టరేట్‌లో కలెక్టర్, టీబీ అధికారులతో, రెడ్‌క్రాస్ సభ్యులతో సమావేశం, 2.45 గంటలకు రచయితలు, కళాకారులు, ప్రముఖులతో ముఖాముఖీలో పాల్గొంటారని చెప్పారు. ప్రొటోకాల్, బందోబస్తు, స్టాళ్ల సందర్శన, డయాస్, సౌండ్ సిస్టం, కరెంట్ సరఫరా తదితరవి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మధుసూదన్‌నాయక్, ఆర్డీఓ నవీన్, ఏఎస్పీ రత్నం, డీఆర్‌డీఓ నర్సింహులు, డీఎంహెచ్‌ఓ పద్మజ, సీపీఓ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల
సంక్షేమానికి చర్యలు
బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. కలెక్టరేట్‌లోని వీసీ హాల్ అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ బెస్ట్ అవైలబుల్ పథకం కింద ఎంపిక చేసిన పాఠశాలలో చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అందిస్తున్న బోధన, ఆరోగ్యం, మెనూ ప్రకారం భోజనం ఇతర మౌలిక వసతుల అమలు తీరును పరిశీలించాలని సూచించారు. పాఠశాలకు ఎంపికై న ప్రతి విద్యార్థి పాఠశాలలో ఉండాలని, సమస్యల పరిష్కారంపై ఆయా పాఠశాలల యాజమాన్యాలతో చర్చించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. అంతకు ముందు ఈ విషయమై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వీసీ నిర్వహించి పలు సూచనలు చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి జనార్దన్, ఎస్సీ అభివృద్ధి అధికారి సునీత, జెడ్పీసీఈఓ వెంకట్‌రెడ్డి, డీఈఓ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.