
అక్షయపాత్ర, హెచ్‌ఎంకు షోకాజ్ నోటీసులు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: బాదేపల్లి పాఠశాల హెచ్‌ఎంతోపాటు అక్షయ పాత్ర ఫౌండేషన్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు డీఈఓ ప్రవీణ్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘మధ్యాహ్న భోజనంలో జెర్రి’ కథనానికి విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఈ మేరకు మంగళవారం డీఈఓ పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనంపై ఆరా తీశారు. పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం పెట్టాలని, భోజనం తినే ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో అభిప్రాయాలు సేకరించారు. అనంతరం అక్షయపాత్ర ఫౌండేషన్ కిచెన్‌ను పరిశీలించి సూచనలు చేశారు.
సీసీరోడ్డు పనులు పునఃప్రారంభం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పాతపాలమూరులోని శ్రీవీరాంజనేయస్వామి ఆలయం నుంచి మైసమ్మ గుడి వరకు అసంపూర్తిగా ఉన్న పనులు ఎట్టకేలకు మంగళవారం పునః ప్రారంభించారు. వాస్తవానికి ఈ ప్రాంతంలో నాలుగు నెలల క్రితం యూజీడీతో పాటు సీసీరోడ్డు పనులను హైదరాబాద్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్ చేపట్టారు. అయితే అప్పట్లో కేవలం రూ.పది లక్షలే మంజూరు కావడంతో మధ్యలో ఆపేశారు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే విషయమై ‘సాక్షి’లో గత నెల 29న ‘ఎందుకీ నిర్లిప్తత..?’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పనులకు కావాల్సిన మరో రూ.15 లక్షలు మంజూరు చేశారు. దీంతో తాజాగా ఇక్కడ మిగిలిన పనులను పునఃప్రారంభించగా.. కార్యక్రమంలో నాయకులు సురేందర్‌రెడ్డి, సిరాజ్‌ఖాద్రీ, వెంకటేష్, శంకర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.