
వృద్ధదంపతుల మృతదేహాలు లభ్యం
● బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి పరామర్శ
● అంబటాపూర్‌కు బీటీరోడ్డు
మంజూరు చేస్తామని హామీ
జడ్చర్ల: మండలంలోని కిష్టారం పోతిరెడ్డి చెరువు అలుగు ప్రవాహంలో గురువారం గల్లంతైన అంబటాపూర్‌కు చెందిన వృద్ధ దంపతుల మృతదేహాలు శనివారం లభ్యమయ్యాయి. అంబటాపూర్‌కు చెందిన భార్యాభర్తలు బాలయ్య, రాములమ్మ ఉపాధి పనులకు సంబంధించిన కూలీ డబ్బులు బ్యాంకు ఖాతాలో పడ్డాయోనని తెలుసుకోవడానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా.. వరదలో రోడ్డు దాటుతూ గల్లంతైన విషయం విధితమే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు గల్లంతైన వారికోసం గాలించినా ఫలితం లేకపోయింది. శనివారం వరద ప్రవాహం గణనీయంగా తగ్గడంతో ఘటన స్థలానికి కొద్దిదూరంలో మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం బాదేపల్లి ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు.
ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి పరామర్శ
ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి శనివారం అంబటాపూర్‌లో మృతదేహాలను పరిశీలించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. భవిష్యత్‌లో ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని, అంబటాపూర్‌కు త్వరలోనే బీటీరోడ్డు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.