
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో బీసీ జేఏసీ నేత మైత్రి యాదయ్యతోపాటు బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన నాయకులు, 500 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరగా.. మంత్రి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే జీర్ణించుకోలేని కొందరు కోర్టుకు పోయి ఆపడం బాధాకరమన్నారు. బీసీ మంత్రులు సుప్రీంకోర్టులో పోరాటం చేసైనా రిజర్వేషన్ అమలు జరిగేలా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించేందుకు అసెంబ్లీలో చర్చించి ఆర్డినెన్సు తెచ్చి జీఓ జారీ చేసిందని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన, బీసీ ఆత్మగౌరవం కోసం పని చేస్తుందన్నారు. పేదల కోసం మహిళ కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, పీసీసీ ప్రధాన కార్యదర్శి మిథున్‌రెడ్డి, నాయకులు వినోద్‌కుమార్, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్‌పీ వెంకటేశ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, నాయకులు సురేందర్‌రెడ్డి, చంద్రకుమార్‌గౌడ్, సిరాజ్‌ఖాద్రీ, కృష్ణయ్య, గోపాల్, మహేందర్ పాల్గొన్నారు.
రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి