
‘ధన్‌ధాన్య’తో రైతులకు వరం
గద్వాల: ప్రధానమంత్రి ధన్‌ధాన్య కృషి యోజన పథకం రైతులకు వరమని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. సోమవారం ఆమె జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధానమంత్రి ధన్‌ధాన్య కృషి యోజన పథకం కింద దేశవ్యాప్తంగా వెనకబడిన ప్రాంతాలైన 100 జిల్లాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. మన రాష్ట్రంలో నాలుగు జిల్లాలు ఎంపిక కాగా పాలమూరు ఉమ్మడి జిల్లాలో జోగుళాంబ గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్ జిల్లాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈపథకం కింద మూడు జిల్లాలకు మొదటి విడత కింద రూ.960 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ప్రధానంగా సాగునీటి వనరు లు లేని ప్రాంతాల్లో సాగునీటి వనరులను కల్పించి వివిధ రకాల పంట ఉత్పత్తులు సాగుచేసేలా అభివృద్ధి చేస్తారన్నారు. అదేవిధంగా రైతులు పండించిన పంటలకు అవరమైన మార్కెటింగ్ సౌకర్యం, మద్దతు ధర కల్పించడం, ఎలాంటి పంటలు సాగుచేస్తే అధిక దిగుబడులు వస్తాయి, సాగుపంటల మార్పిడి వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు. రైతులు పండించిన పంట ఉత్పత్తులను నిల్వచేసుకునేలా పెద్ద ఎత్తున గోదాములను నిర్మిస్తామని, రైతుల ఉత్పత్తి సంఘాల ద్వారా రైతులకు సబ్సిడీపై రుణాలు అందిస్తామన్నారు.
వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి
వ్యవసాయ అనుబంధరంగాలైన డైరీ, గొర్రెలపెంపకం, చేపల ఉత్పత్తి వంటివాటిని అభివృద్ధి చేస్తారని ఆమె వివరించారు. ఈప్రాంతప్రజల తరపున దేశప్రధాని మోడీ, వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సిగ్‌చౌహాన్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కోన్నారు. 2047నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా అన్ని రంగాల్లో అభివృద్ది చెందేలా దేశప్రధాని మోడీ ఒకవిజన్‌తో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో గడచిన పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన, ప్రస్తుతం కాంగ్రెస్ పాలన వల్ల ప్రజలకు ఎలాంటి మేలు చేకూరడం లేదన్నారు. ఈరెండు ప్రభుత్వాలు పాలనపరంగా పూర్తిగా వైఫల్యం చెందినట్లు విమర్శలు చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు డీకే స్నిగ్ధారెడ్డి, రామాంజనేయులు, రాంచంద్రారెడ్డి, బండల వెంకట్రాములు, వెంకటేశ్వర్‌రెడ్డి, రమాదేవి, బలిగెర శివారెడ్డి, దేవదాసు, రజకజయశ్రీ, విజయలక్ష్మీ, సమత తదితరులు పాల్గొన్నారు. అనంతరం గద్వాల జిల్లా మహిళా యువమోర్చా అధ్యక్షురాలిగా సమత, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడుగా దేవదాస్‌లను నియమిస్తూ వారికి నియామక పత్రాలు అందజేశారు. ఇదిలాఉండగా, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన సుమారు 250మంది నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరగా.. ఎంపీ కండువాలు కప్పారు. అలాగే, డి లిమిటేషన్ ప్రక్రియలో అయిజను అసెంబ్లీ, గద్వాలను పార్లమెంట్ నియోయోజకవర్గంగా ఏర్పాటు చేయాలని కోరుతూ వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు, కులసంఘాలకు చెందిన అఖిలపక్ష కమిటీ నేతలు ఎంపీ డీకే అరుణకు వినతిపత్రం అందజేశారు.
గద్వాల, పేట, నాగర్‌కర్నూల్ జిల్లాలు పథకానికి ఎంపిక
మొదటి విడతగా రూ.960 కోట్లతో అభివృద్ధి పనులు
మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ