
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల్లో కలవరం?
● కోతకు సిద్ధమవుతున్న ప్రభుత్వం
● ఉమ్మడి జిల్లా రిజిస్ట్రేషన్ శాఖలో
20 మంది.. ముగ్గురికే అవకాశం
మెట్టుగడ్డ: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులను తగ్గించుకునేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. స్టాంప్స్, రిజిస్ట్రేషన్‌శాఖలో 300పైగా ఉద్యోగులుండగా.. కేవలం 110 మందిని మాత్రమే కొనసాగించేందుకు ఆర్థికశాఖ అనుమతినిచ్చింది. మిగతా 190 మందికి ఉద్వాసన పలుకుతారా? అన్న చర్చ పొరుగు సేవల ఉద్యోగుల్లో మొదలైంది.
ఉమ్మడి జిల్లాలో..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, ఒక జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ఉంది. అన్ని కార్యాలయాల్లో 20 మంది ఉద్యోగులు పొరుగు సేవల ప్రాతిపదికన పనిచేస్తున్నారు. వీరికి ఏటా పొడగింపునకు ప్రభుత్వం అనుమతినిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి. ఈ శాఖలో పెరిగిన పని భారానికి అనుగుణంగా నియామకాలు లేకపోవడంతో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులే ఆధారంగా మారారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రస్తుతం ఉన్న 20 మంది ఉద్యోగుల్లో కేవలం ముగ్గురిని మాత్రమే కొనసాగింపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మిగతా 17 మంది ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది. చాలీచాలని వేతనాలతో పనిచేసే తాము రోడ్డున పడతామని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై జిల్లా రిజిస్ట్రార్‌ను ఫోన్‌లో సంప్రదించేందుకు యత్నించగా అందుబాటులోకి రాలేదు.