
బండరాయి పైనుంచి పడి ఇద్దరు కూలీల మృతి
మహబూబ్‌నగర్ క్రైం: జీవనోపాధికి వచ్చి.. ప్రమాదవశాత్తు రాయి మీదనుంచి కిందపడి ఇద్దరూ వడ్డెర కూలీలు మృతిచెందినట్లు కోయిలకొండ ఎస్‌ఐ తిరుపాజీ తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం బొల్లారం గ్రామానికి చెందిన పెద్ద మౌలాలీ(50), వనపర్తి మండలం కిష్టగిరికి చెందిన వడ్డె కురుమూర్తి(28) కుటుంబాలతోపాటు మరో రెండు కుటుంబాలు కలిసి మూడేళ్ల కిందట కోయిలకొండ మండలం అమరనాయక్‌తండా సమీపంలో ఇళ్లను అద్దెకు తీసుకుని పంట పొలాలు, గుట్టలో రాళ్లు కొడుతూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం పెద్ద మౌలాలీ, కురుమూర్తి పెద్దగుండుపై రాళ్లు తొలుస్తుండగా.. గుండుజారీ కిందపడడంతో పెద్దమౌలాలీ తలకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన కురుమూర్తిని జిల్లా ఆస్పత్రికి తరలించగా రాత్రి 8:30ప్రాంతంలో మృతిచెందాడు. పెద్దమౌలాలీకి భార్య, ఇద్దరు కూతుర్లు, కొడుకు ఉన్నారు. కురుమూర్తికి భార్య ఉన్నది. బుధవారం మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.
ముంబైలో వలస కూలీ మృతి
నారాయణపేట రూరల్: పొట్టకూటి కోసం వలస వెళ్లిన కూలీ ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందాడు. గ్రామస్తులు కథనం ప్రకారం.. నారాయణపేట జిల్లా కోటకొండకు చెందిన కావలి యాదప్ప(45) రెండు దశాబ్దాలకుపైగా ముంబైలో కూలీ పనిచేస్తున్నాడు. సోదరుడు నర్సింహులు వెంట వెళ్లి పని నేర్చుకుని అక్కడే ఉంటున్నాడు. 18ఏళ్ల కిందట నర్సింగమ్మతో పెళ్లి కాగా కూతురు, కూమారుడు ఉన్నారు. కూతరు ఇంటర్ ద్వితీయ సంవత్సరం, కూమారుడు ఏడో తరగతి చదువుతున్నారు. భార్యాపిల్లలు స్వగ్రామంలో ఉండగా పెళ్లి తర్వాత ముంబైలోని అంధేరిలో ఉంటూ మేస్త్రి కింద భవన నిర్మాణ పనులకు వెళ్తుండేవాడు. బుధవారం 14వ అంతస్తులో ప్లాస్టర్ పనిచేస్తుండగా పరంచ కర్ర విరిగి కిందపడ్డాడు. సేఫ్టీబెల్ట్ లేకపోవడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ముంబై వెళ్లారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎనిమిది నెలల క్రితమే కూతురు న్యూరో సంబంధిత వ్యాధితో బాధ పడుతుండగా రూ.3లక్షల వరకు అప్పు చేసి చికిత్స చేయించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అప్పు తీర్చేందుకే మళ్లీ ముంబై వెళ్లాడని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

బండరాయి పైనుంచి పడి ఇద్దరు కూలీల మృతి