
తాగి వేధిస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్య
● వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు
● భార్య, బామ్మర్దులు, అత్త రిమాండ్
వనపర్తి: తాగొచ్చి వేధిస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్య కేసును రేవల్లి పోలీసులు ఛేదించినట్లు వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కేసులో భార్య, ముగ్గురు బామ్మర్దులు, అత్తను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం వెల్లడించారు. రేవల్లి మండలం చెన్నారానికి చెందిన శివలీలతో పాన్‌గల్ మండలం అన్నారం గ్రామానికి చెందిన గడ్డం నర్సింహ(35)కు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కూరుతు ఉంది. నర్సింహ ప్లంబర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కొన్నాళ్లుగా మద్యానికి బానిసై పనికి వెళ్లకుండా రోజూ తాగొచ్చి భార్యను వేధించేవాడు. శివలీల వనపర్తిలోని ఓ క్లాత్‌స్టోర్‌లో పనిచేస్తోంది. భార్య సంపాదనను తాగడానికి ఇవ్వాలని ప్రతిరోజూ గొడవ పడేవాడు. 20రోజుల క్రితం నర్సింహ శివలీలను ఇంటి నుంచి పంపించేయడంతో బామ్మర్ది లోకేశ్ శివలీల, కూతురు దీప్తిని చెన్నారానికి తీసుకెళ్లాడు. శివలీల అక్కడే తల్లితో ఉంటోంది. దసరా సందర్భంగా హైదరాబాద్ నుంచి వచ్చిన శివలీల తమ్ముళ్లు శశికిరణ్, గంగాధర్, లోకేశ్‌కు భర్త వేధింపుల విషయం చెప్పడంతో నర్సింహను హత్య చేయాలని పథకం వేశారు. ఈనెల 3న రాత్రి 10గంటల సమయంలో నర్సింహను చెన్నారం గ్రామానికి పిలిపించి ఫుల్లుగా మద్యం తాగించారు. తర్వాత కళ్లలో కారంపొడి చల్లి, చీపురు కట్ట, డంబెల్‌తో తలపై, వీపుపై బలంగా కొట్టి చంపేశారు. బయటకు అరుపులు వినిపించకుండా ఇంటి బయట స్పీకర్లు పెట్టి జాగ్రత్తలు తీసుకున్నారు. మృతుడి తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేయడంతోపాటు వారినుంచి సెల్‌ఫోన్లు, కారు, బైక్‌ను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపర్చగా జడ్జి రిమాండ్ విధించినట్టు తెలిపారు.