
పిచ్చికుక్క దాడిలోఐదుగురికి గాయాలు
మల్దకల్: మండలంలోని నాగర్‌దొడ్డిలో పిచ్చికుక్క దాడిలో ఐదుగురు తీవ్రంగా గాయపడిన బుధవారం చోటుచేసుకున్నది. బుధవారం ఉదయం గ్రామంలో ఓ పిచ్చికుక్క వీధుల వెంట వెళ్లి ఇళ్ల పరిసరాల్లో ఉన్న షాలిని, తిమ్మప్పతోపాటు మరో ముగ్గురిపై దాడిచేసి తీవ్రంగా గాయపరచింది. గాయపడిన వారిని వెంటనే గద్వాల ఆస్పత్రికి తరలించారు. గాయపరిచిన పిచ్చికుక్కను గ్రామస్తులు దాడిచేసి చంపేశారు. గ్రామంలో పిచ్చికుక్కల బెడద లేకుండా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కొనసాగుతున్న ఐటీ దాడులు
ఉండవెల్లి: మండలంలోని జాతీయ రహదారి పక్కనున్న వీకేర్ సీడ్స్ కంపెనీపై ఏపీ, తెలంగాణకు చెందిన ఐటీ అధికారుల మంగళవారం నిర్వహించిన దాడులు బుధవారం కొనసాగాయి. రెండోరోజు ఏకథాటిగా దాడు లు కొనసాగుతున్నాయని, అధికారులు ఎలాంటి సమాచారం తెలుపకపోవడం గమనార్హం.
మహిళ మృతిపై కేసు నమోదు
గోపాల్‌పేట: మహిళ మృతిచెందిన విషయమై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నరేశ్‌కుమార్ తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం.. ఏదులకు చెందిన కాతోజు గీత(32), రామాచారి భార్యాభర్తలు. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. మంగళవారం ఉదయం ఇంటివద్ద భార్యాభర్తలకు చిన్నపాటి గొడవ చోటుచేసుకుంది. క్షనికావేశానికి గురైన గీత ఇంట్లోకి వెళ్లి టర్పెంట్ ఆయిల్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలకు తాళలేక అరుస్తూ బయటికి వచ్చింది. గమనించిన భర్త, పక్కన ఉన్నవారు మంటలను ఆర్పి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతిచెందింది. ఈ విషయంపై మృతురాలి అన్న నర్సింహాచారి బుధవారం ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశామని తెలిపారు.