మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: మన్యంకొండలోని శ్రీలక్షీవేంకటేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం హుండీ లెక్కించగా రూ.30,36,630 ఆదాయం వచ్చింది. మూడు నెలల కాలం (జూలై 9 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు)లో ఈ ఆదాయం దక్కినట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అలహరి మధుసూదన్‌కుమార్ తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఈఓ శ్రీనివాసరాజు, ఇన్‌స్పెక్టర్ వీణాధరణి, పాలక మండలి సభ్యులు అలహరి రామకృష్ణ, వెంకటాచారి, అలివేలమ్మ, సుధ తదితరులు పాల్గొన్నారు.
తైక్వాండోకు 15 మంది ఎంపిక
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో బుధవారం జిల్లాస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14, 17, 19 విభాగాల్లో బాలబాలికల తైక్వాండో ఎంపికలు నిర్వహించారు. మొత్తం 25 మంది హాజరైనట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శారదాబాయి తెలిపారు. గురువారం గద్వాలలో ఉమ్మడి జిల్లాస్థాయి తైక్వాండో పో టీలకు 15 మందిని ఎంపిక చేశామని పేర్కొ న్నారు. కార్యక్రమంలో డీఐఈఓ కౌసర్ జహాన్, పీడీలు వేణుగోపాల్, జగన్‌మోహన్‌గౌడ్, తైక్వాండో కోచ్ సురేందర్‌బాబుపాల్గొన్నారు.
రేపు ఎస్‌జీఎఫ్ వాలీబాల్ జట్ల ఎంపిక
జడ్చర్ల టౌన్: బాదేపల్లి జెడ్పీహైస్కూల్ ప్రాంగణంలో శుక్రవారం ఎస్‌జీఎఫ్ జిల్లా అండర్–17 వాలీబాల్ బాలబాలికల టోర్నీ కమ్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి శారదాబాయి తెలిపారు. హాజరయ్యే క్రీడాకారులు ఆధార్ కార్డు, బోనఫైడ్ జిరాక్స్ తీసుకుని రావాలని కోరారు. వివరాలకు పీడీ కల్యాణ్ (94923 53037)ను సంప్రదించాలని సూచించారు. ఎంపికయ్యే క్రీడాకారులు ఈ నెల 13వ తేదీన ఇదే ప్రాంగణంలో నిర్వహించనున్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టోర్నీ కమ్ సెలక్షన్స్ పాల్గొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
స్వల్పంగా పెరిగిన ఉల్లి ధర
దేవరకద్ర: స్థానిక మార్కెట్ యార్డులో బుధవారం ఉల్లి వేలం జోరుగా సాగింది. రెండు వారాలుగా మార్కెట్‌కు సెలవుల కారణంగా ఉల్లి వేలం నిర్వహించలేదు. ఈ వారం ఉల్లి వేలం దాదాపు వేయి బస్తాల ఉల్లిని అమ్మకానికి తెచ్చారు. వేలంలో ఉల్లి క్వింటాల్ ధర గరిష్టంగా రూ.1,950 ధర పలికింది. రెండు వారాల క్రితం కంటే రూ.250 ఎక్కువ ధర వచ్చింది. కనిష్టంగా రూ.1000 వరకు పలికింది. కాగా.. మధ్యాహ్నం మార్కెట్‌లో జరిగిన టెండర్లలో ఆముదాల ధర క్వింటాల్‌కు రూ.5,622, హంస ధాన్యం క్వింటాల్‌కు రూ.1,719గా ఒకే ధర నమోదయ్యాయి.

మన్యంకొండ ఆదాయం రూ.30.36 లక్షలు