
జిల్లాకేంద్రంలో భారీ వర్షం
● ఈదురు గాలులతో పాటు
ఉరుములు, మెరుపులు
పద్మావతికాలనీలో విరిగి నేలకొరిగిన పెద్ద చెట్టు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు తీవ్రంగా వీచాయి. దీంతో పద్మావతికాలనీలో ఓ పెద్ద చెట్టు విరిగి రోడ్డుకు అడ్డంగా పడింది. స్థానికులు గమనించి మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి సిబ్బంది వచ్చి దానిని జేసీబీతో ఒక పక్కకు నెట్టేశారు. ముఖ్యంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రామయ్యబౌలి, శివశక్తినగర్, బాలాజీనగర్, భగీరథకాలనీ, బీకేరెడ్డికాలనీ, నాగిరెడ్డికాలనీ, నాగేంద్రనగర్, గచ్చిబౌలి, గణేష్‌నగర్, రాయచూర్‌రోడ్, వల్లభ్‌నగర్, లక్ష్మీనగర్‌కాలనీ తదితర ప్రాంతాల్లో డ్రెయినేజీలు నిండి పొంగిపొర్లాయి. మెయిన్ రోడ్డు (ఎన్‌హెచ్–167) పై వరద ఏరులై పారింది. కొత్తబస్టాండు ప్రాంగణంతో పాటు ప్రధాన రహదారులు, వీధుల్లో మురుగుతో వరద కలిసి ఏరులై పారాయి. వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల కొద్దిసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.

జిల్లాకేంద్రంలో భారీ వర్షం