
పోలీస్ వ్యవస్థను మెరుగైన స్థితిలో ఉంచాలి
● డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్
మహబూబ్‌నగర్ క్రైం: పోలీస్ వ్యవస్థను ప్రజలకు అనుకూలంగా తీర్చిదిద్దడంతో పాటు, ప్రతి ఒక్క రూ బాధ్యతతో పని చేయాలని జోగుళాంబ జోన్– 7 డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం డీఐజీ వార్షిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో ఉండే అన్ని విభాగాలను తనిఖీ చేశారు. ఇందులో ప్రధానంగా డీపీఓ, ఎస్‌బీ, డీసీఆర్‌బీ, ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లలో ఉన్న అన్ని రకాల రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు, పారదర్శకత తదితర అంశాలపై తనిఖీ చేపట్టారు. పోలీసు రికార్డులు, రిజిస్టర్లు, ఆఫీస్ ఫైల్స్, బలగాల హాజరు రికార్డులు, ఆయుధ నిల్వలు, వాహనాల సంరక్షణ విధానాన్ని పరిశీలించారు. అనంతరం డీఐజీ మా ట్లాడుతూ ప్రజలతో అనుసంధానంగా ఉంటూ సకాలంలో సమస్యలపై స్పందించి క్రమశిక్షణతో విధులు నిర్వహించాలన్నారు. రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా అప్‌డేట్ చేయాలన్నారు. జిల్లా లో నేరాల నివారణ చట్ట వ్యవస్థ కాపాడటంలో పోలీసులు చూపుతున్న కృషి భవిష్యత్‌లో మరింత మెరుగైన స్థితిలో ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ డి.జానకి, అదనపు ఎస్పీలు ఎన్‌బీ రత్నం, సురేష్‌కుమార్, డీఎస్పీలు రమణారెడ్డి, శ్రీనివాసు లు, ఏవో, ఆర్‌ఐలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.