పాన్‌గల్: సైబర్ క్రైమ్ మోసంలో మండలంలో ఓ మహిళ తన బ్యాంకు ఖాతా నుంచి రూ.9,76,995 నగదును పోగొట్టుకున్న ఘటనపై మంగళవారం కేసు నమోదైనట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బండపల్లికి చెందిన కొమారి సరితకు పాన్‌గల్ ఎస్‌బీఐలో ఖాతా ఉంది.
ఏప్రిల్ 20, 2024న ఆమె మొబైల్ వాట్సాప్‌కు ఒక లింక్ వస్తే దానిని ఓపెన్ చేసి లింక్ స్క్రీన్‌ను షేర్ చేసింది. దీంతో ఫోన్‌పే ద్వారా ఆమె తెలియకుండానే ఏప్రిల్ 20 నుంచి అక్టోబర్ 4, 2024 వరకు ఆమె బ్యాంక్ ఖాతా నుంచి రూ.3 వేలు, రూ.5 వేలు చొప్పున మొత్తం రూ.9,76,995 వరకు డ్రా అయ్యాయి. ఘటనపై ఎస్‌బీఐ కస్టమర్ కేర్, బ్యాంక్ మేనేజర్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తన బ్యాంకు ఖాతా నుంచి నగదును డ్రా చేసిన సైబర్ నేరగాళ్లపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం కొమారి సరిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ మోసంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మసీద్‌లో చోరీ
చిన్నంబావి: మండలంలోని బెక్కం గ్రామంలోని మసీద్‌లో 14 కేజీల వెండి అభరణాలు చోరీకి గురైన ఘటన చోటు చేసుకుంది. ఎస్‌ఐ జగన్మోహన్ చెప్పిన వివరాల ప్రకారం.. మండలంలోని బెక్కం గ్రామంలోని పీర్ల మసీద్ తాళాలు పగులగొట్టి సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు విలువైన సామగ్రిని ఎత్తుకెళ్లారు.
మంగళవారం ఉదయం గ్రామానికి చెందిన స్వీపర్ మసీద్‌ను శుభ్రం చేసేందుకు వెళ్లగా.. మసీద్‌లో పీర్ల సామగ్రి లేకపోవడంతో గమనించిన ఆమె వెంటనే గ్రామస్థులకు విషయం తెలిపింది. వారు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే ఎస్‌ఐ ఘటన స్థలాన్ని డాగ్‌స్క్వాడ్‌తో పరిశీలించారు. చోరీపై కేసు నమోదు చేసి అనుమానితులను విచారిస్తున్నామన్నారు. ఘటన స్థలాన్ని డీఎస్పీ వెంకటేశ్వరావు, సీఐ కృష్ణ పరిశీలించారు.