
ఘరానా దొంగ అరెస్ట్
● 43 గ్రాముల బంగారం, 7 కిలోల
వెండి ఆభరణాలు, నగదు రికవరీ
● వివరాలు వెల్లడించిన
మహబూబ్‌నగర్ ఎస్పీ డి.జానకి
మహబూబ్‌నగర్ క్రైం: పాలమూరులో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఘరాన దొంగను పోలీసులు ఎట్టకేలకు మంగళవారం పట్టుకున్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మహబూబ్‌నగర్ ఎస్పీ డి.జానకి పూర్తి వెల్లడించారు. జిల్లాకేంద్రంలోని గణేష్‌నగర్‌లో నివాసం ఉండే నాగేశ్వర్‌రెడ్డి కుటుంబంతో కలిసి సెప్టెంబర్ 28న తిరుపతికి వెళ్లారు. సెప్టెంబర్ 29న తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి దొంగతనం చేశారు. 30వ తేదీన ఉదయం ఇల్లు శుభ్రం చేయడానికి వచ్చిన పని మనిషి ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో వెంటనే నాగేశ్వర్‌రెడ్డికి సమాచారం ఇచ్చింది. ఆయన వెంటనే తన అన్న రాజేశ్వర్‌రెడ్డికి విషయం తెలుపగా వచ్చి ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా బీరువాలో ఉన్న నాలుగు కిలోల వెండి ఆభరణాలు, రూ.20 నగదు అపహరించినట్లు గుర్తించి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజేశ్వర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం ఉదయం ట్యాంక్‌బండ్‌పై చేసిన తనిఖీల్లో నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లికి చెందిన ఎండీ మహబూబ్‌పాషా అలియాస్ బిర్యానీ పాషా పట్టుబడ్డాడు. అతడిని విచారించగా గణేష్‌నగర్‌తో పాటు మరో పది దొంగతనాలు చేసినట్లు ఒప్పకున్నారు. నేరస్తుడు ఎండీ మహబూబ్ పాషా కారు డ్రైవర్‌గా జీవనం సాగిస్తుండటంతో పాటు తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడిపై వన్‌టౌన్‌లో ఒకటి, టూటౌన్‌లో రెండు, రూరల్‌లో ఐదు, దేవరకద్ర పోలీస్ స్టేషన్‌లో రెండు దొంగతనం కేసులు నమోదైనట్లు వెల్లడించారు. మహబూబ్‌పాషా నుంచి రూ.43 గ్రాముల బంగారం, 7 కిలోల వెండి ఆభరణాలు, రూ.26, 660 నగదు, కారు, సెల్‌ఫోన్ రికవరీ చేసినట్లు తెలిపారు. కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎస్పీ చెప్పారు. కేసును ఐటీ సెల్ అధికారులతో పాటు సీసీఎస్, వన్‌టౌన్ పోలీసులు సమన్వయంతో ఛేదించారని ఎస్పీ తెలుపడంతో పాటు అభినందించారు. సమావేశంలో డీసీఆర్బీ డీఎస్పీ రమణారెడ్డి, వన్‌టౌన్ సీఐ అప్పయ్య, సీసీఎస్ సీఐ రత్నం, ఎస్‌ఐ శీనయ్య తదితరులు పాల్గొన్నారు.