
తడిసి ముద్దయిన మొక్కజొన్న
● బాదేపల్లి యార్డులో తడిసిన మొక్కజొన్న
● ఆలస్యంగా టెండర్లు దాఖలు
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం ఆకస్మికంగా కురిసిన వర్షానికి యార్డు ఆవరణలో ఆరబోసిన మొక్కజొన్న తడిసి ముద్దయ్యింది. వర్షం నీరు ఉధృతంగా దిగువకు ప్రవహించడంతో ఆరబోసిన మొక్కజొన్న కొట్టుకుపోయింది. అయితే కొందరు రైతులు మొక్కజొన్నను షెడ్లలోనే ఆరబోయడంతో వర్షం ముప్పు తప్పింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ఓ వ్యాపారి మొక్కజొన్న కూడా వర్షానికి కొట్టుకుపోయింది. యార్డు ఆవరణలో సీసీ ఉండడంతో.. ఆరబోసిన మొక్కజొన్నను కుప్పగట్టేందుకు కూడా సమయం దొరకనంత వేగంగా వ రద దిగువకు ప్రవహిస్తుందని వాపోయారు. ఇప్పటికై నా అధికారులు, పాలకులు స్పందించి మార్కెట్‌లో షెడ్ల నిర్మాణాలు చేపట్టి వర్షం ముప్పు నుంచి ధాన్యం కాపాడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఏజెంట్లు, వ్యావారుల మధ్య వాగ్వాదం
బాదేపల్లి యార్డులో మంగళవారం వ్యాపారులు ఆలస్యంగా టెండర్లు దాఖలు చేశారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులకు మధ్య విభేదాలు తలెత్తడంతో టెండర్లు నిలిపివేయడంతో గందరగోళం చోటు చేసుకుంది. కమీషన్ ఏజెంట్ల ద్వారా పంట దిగుబడులను కొనుగోలు చేసిన వ్యాపారులు 20 రోజుల వ్యవధిలో అందుకు సంబంధించిన డబ్బులను ఏజెంట్లకు ఇవ్వాల్సి ఉంటుంది. 20 రోజుల గడువు ముగిసిన తరువాత రూ.1.50 వడ్డీతో మొత్తాన్ని ఇవ్వాల్సి ఉంటుందన్న నిబంధనలు ఉన్నాయి. అయితే తాము బయట రూ.3 వడ్డీకి తెచ్చి రైతులకు డబ్బులు సర్దుబాటు చేస్తున్నామని, వ్యాపారు లు కూడా తమకు రూ.3 వడ్డీ చొప్పున చెల్లించాలని డిమాండ్ చేయడంతో వివాదం నెలకొంది. దీంతో మార్కెట్ యార్డు చైర్‌పర్సన్ జ్యోతి జోక్యం చేసుకుని సమస్యలపై తరువాత చర్చిద్దామని, ప్రస్తుతానికి రైతులకు ఇబ్బందులు కలుగనీయకుండా టెండర్లు వేయాలని నచ్చజెప్పడంతో తాత్కాలికంగా సమస్య సద్దుమనిగింది.
మొక్కజొన్న క్వింటాల్ రూ.2,057
బాదేపల్లి మార్కెట్‌లో మంగళవారం 1,772 క్వింటాళ్ల మొక్కజొన్న విక్రయానికి వచ్చింది. క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,057, కనిష్టంగా రూ.1,601 ధరలు లభించాయి. అదేవిధంగా ఆముద క్వింటాల్‌కు రూ.5,020, వేరుశనగకు గరిష్టంగా రూ. 4609, కనిష్టంగా రూ.3356 ధరలు పలికాయి.

తడిసి ముద్దయిన మొక్కజొన్న