
మద్యం టెండర్లపై ఎన్నికల ఎఫెక్ట్
● పెద్దగా ఆసక్తి చూపని వ్యాపారులు
● ఉమ్మడి జిల్లాలో 227 దుకాణాలకు 40 టెండర్లు మాత్రమే దాఖలు
మహబూబ్‌నగర్ క్రైం: మద్యం దుకాణాల టెండర్లపై స్థానిక ఎన్నికల ప్రభావం అధికంగా పడుతుందనే చర్చ సాగుతోంది. మరోవైపు దరఖాస్తు ఫీజు సైతం రూ.3 లక్షలకు పెంచడంతో వ్యాపారులు దరఖాస్తు చేసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ప్రధానంగా చాలా మంది స్థానిక ఎన్నికల్లో ఖర్చు పెట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో మద్యం దుకాణాల టెండర్లు వేద్దామా.. లేక ఎన్నికల బరిలో ఉందామా అనే ఆలోచనలో తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో టెండర్ల ప్రక్రియ మొదలైన మొదటివారం నుంచే దరఖాస్తుల హడావుడి కనిపించేది. కానీ ఈసారి ఊహించిన స్థాయిలో కనిపించడం లేదు. ఇంకా దరఖాస్తు చేసుకోవడానికి 11 రోజుల వ్యవధి ఉన్న క్రమంలో చివరి వారం రోజుల్లో వేగం పుంజుకుంటుందా.. లేక ఇలాగే ఉంటుందోనని ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే చివరి నాలుగు రోజుల్లో భారీగా టెండర్లు రావొచ్చనే ధీమాలో ఎకై ్సజ్ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోతే ప్రభుత్వం గడువు పొడిగించే అవకాశం లేకపోలేదు. కాగా.. ఉమ్మడి జిల్లాలో మంగళవారం 13 టెండర్లు దాఖలయ్యాయి. వీటిలో మహబూబ్‌నగర్ జిల్లాలో 7, నారాయణపేటలో 3, నాగర్‌కర్నూల్ జిల్లాలో 3 దరఖాస్తులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో మొత్తం 40 టెండర్లు మాత్రమే దాఖలు కావడం విశేషం. మద్యం అమ్మకాలు గణనీయంగా ఉండే జోగుళాంబ గద్వాల జిల్లాలో వ్యాపారులు టెండర్లు వేయడానికి ముందుకు రాలేదు. అదేవిధంగా వనపర్తి జిల్లాలో సైతం అదే పరిస్థితి కనిపిస్తోంది.