
పొరపాట్లు లేకుండా ఎన్నికలు నిర్వహించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): స్థానిక సంస్థ ఎన్నికలను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో అధికారుల విధులు చాలా కీలకమని, చిన్న పొరపాటుకు కూడా అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలన్నారు. ఈసీ నిబంధనలకు అనుగుణంగా పకడ్బందీగా ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలు, మార్గ దర్శకాలపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఏమైనా సందేహాలు ఉంటే శిక్షణ కార్యక్రమంలో నివృత్తి చేసుకోవాలన్నారు. మాస్టర్ ట్రైనర్ బాలుయాదవ్ ఎన్నికల నిర్వహణ, ప్రిసైడింగ్ అధికారుల విధులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో డీపీఓ పార్థసారథి ఇతర అధికారులు పాల్గొన్నారు.
పోషణ్ మాసోత్సవం పోస్టర్ ఆవిష్కరణ
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీవరకు నిర్వహించే పోషణ్ మాసోత్సవం పోస్టర్‌ను మంగళవారం కలెక్టరేట్‌లోనీ మీటింగ్ హాల్‌లో కలెక్టర్ విజయేందిర బోయి ఆవిష్కరించారు. పోషణ మాసం కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారం అందించాలన్నారు. క్యాక్రమంలో జిల్లా సంక్షేమాధికారి జరినా బేగం, డీఎంహెచ్‌ఓ పద్మజా, డీపీఓ పార్థసారధి, బీసీ సంక్షేమాదికారి ఇందిర, బాలుయాదవ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.