
వైద్యం వికటించి బాలుడి మృతి
జడ్చర్ల: జ్వరంతో బాధపడుతున్న ఓ బాలుడికి ఆర్‌ఎంపీ చికిత్స చేసిన తర్వాత మరింత అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృత్యువాత పడిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా.. మండల పరిదిలోని కుర్వపల్లి గ్రామానికి చెందిన భూపని కుర్మయ్య, మాధవి దంపతుల కుమారుడు వరుణ్‌తేజ్(11). బాలుడికి ఇటీవల జ్వరం రావడంతో సమీప గ్రామం కోడ్గల్‌లో ఆర్‌ఎంపీ శ్రీశైలం నిర్వహిస్తున్న సాయి క్లినిక్‌కు ఆదివారం తీసుకెళ్లారు. అక్కడ చికిత్స చేయించుకున్న అనంతరం తిరిగి ఇంటికి వెళ్లిన కొద్ది సేపటికే బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మతిస్థిమితం కోల్పోయిన వాడిలా వ్యవహరించడంతో వెంటనే సంబందిత ఆర్‌ఎంపీకి ఫోన్‌లో సమాచారం ఇవ్వడంతో ఆయన కుర్వపల్లికి చేరుకుని బాలుడికి ఇంజెక్షన్ చేశాడు. అయినా పరిస్థితి ఎలాంటి మార్పు రాకపోవడంతో జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి విషయం చెప్పడంతో అక్కడి డాక్టర్లు సంబంధిత ఆర్‌ఎంపీకి ఫోన్ చేసి అతను అందించిన చికిత్స వివరాలను ఆరా తీసి మందలించారు. పరిస్థితి విషమంగా ఉందని వెంటనే మెరుగైన ఆసుపత్రికి తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించచడంతో అంబులెన్స్‌లో హైద్రాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో బాలుడు మృతి చెందాడు. ఆర్‌ఎంపీ వైద్యం కారణంగానే తమ కుమారుడు మృతిచెందాడని తల్లిదండ్రులతో పాటు బంధువులు లింగంపేటలోని ఆర్‌ఎంపీ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఆర్‌ఎంపీ బాదిత కుటుంబానికి రూ.4.50 లక్షలు పరిహారం ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెల్సింది. బాలుడి తండ్రి కుర్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు, బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు సీఐ కమలాకర్ తెలిపారు.
ఆర్‌ఎంపీ ఇంటి ఎదుట
బాధితుల ఆందోళన