
అత్తను హత్య చేసిన కోడలి అరెస్టు
వనపర్తి: వృద్ధాప్యంలో ఉన్న అత్తకు సేవ చేయాల్సిందిపోయి.. ఓ కోడలు అత్తపై విచక్షణారహితంగా దాడి చేసి చంపిన ఘటన రేవల్లి మండలం నాగపూర్‌లో చోటుచేసుకొంది. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలను వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు సోమవారం విలేకర్లకు వెల్లడించారు. రేవల్లి మండలం నాగపూర్ గ్రామానికి చెందిన దొడ్డి ఎల్లమ్మ(75), దొడ్డి బొగురమ్మ అత్తాకోడళ్లు. కొంతకాలంగా అత్త ఎల్లమ్మ అనారోగ్యం బారిన పడడంతో మందులు, తినేందుకు డబ్బులు ఇవ్వాలంటూ తరచూ కోడలిని అడుగుతుండడంతో ఆమె విసుగుచెందింది. ఈనెల 4న మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అత్తను చంపితే ఎలాంటి గొడవలు, ఇబ్బందులు ఉండవని నిర్ధారించుకుని ఇంట్లో, చుట్టుపక్కల ఎవరూ లేని సమయంలో కట్టె, రొట్టెలు చేసే ఇనుప పెంకుతో అత్త తలపై బలంగా కొట్టడంతో ఆమె మృతి చెందింది. ఈక్రమంలో మంచం, భూమిపై పడిన రక్తం మరకలను కోడలు తుడిచి ఏమీ తెలియనట్టుగా నటించింది. తన అత్త వృద్ధాప్యం మీద పడడం, అనారోగ్యంతో మృతిచెందిందని చుట్టుపక్కల వారికి, బంధువులకు చెప్పింది. వారు కూడా అదే నిజమని భావించారు. ఈక్రమంలో ఈ నెల 5న మృతురాలిని అంత్యక్రియలకు సిద్ధం చేసే క్రమంలో ఎల్లమ్మ తలకు రక్తగాయాలు కనిపించడంతో బంధువులు కోడలిని నిలదీశారు. బంధువులు దాడిచేస్తారని గమనించి కోడలు బొగురమ్మ అక్కడి నుంచి పారిపోయింది. ఈమేరకు ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కోడలు బొగురమ్మను అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టగా.. జడ్జి రిమాండ్‌కు తరలించాలని ఆదేశించినట్లు డీఎస్పీ తెలిపారు. కేసు చేదించడంలో కీలకపాత్ర పోషించిన వనపర్తి సీఐ, కృష్ణయ్య, రేవల్లి ఎస్‌ఐ రజిత, పోలీసు కానిస్టేబుళ్లు, అంజనేయులు, రామకృష్ణ, మౌలానాను డీఎస్పీ అభినందించారు.