
‘చివరకు న్యాయమే గెలిచింది’
● అఖిల పక్ష జేఏసీ నాయకుడు వెంకట్రాంరెడ్డి
● ఆరున్నరేళ్లకు కేసు కొట్టివేయడంతో సంబరాలు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్)/నారాయణపేట: ఆరున్నరేళ్ల కిందట అఖిలపక్ష నాయకులపై పెట్టిన కేసులో చివరకు న్యాయమే గెలిచిందని అఖిల పక్ష జేఏసీ నాయకుడు వెంకట్రాంరెడ్డి పేర్కొన్నారు. కోయిల్‌కొండ మండలంలోని దమాయపల్లి గేటు వద్ద 2019లో జరిగిన నిరసనలో సీఐ పాండురంగపై దాడి చేశారనే నెపంతో అఖిల పక్ష నాయకులపై పెట్టిన కేసును సోమవారం కోర్టు కొట్టి వేయడంతో మండలంలోని గార్లపహాడ్ గేట్ వద్ద అఖిల పక్ష నాయకులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నారాయణపేట జిల్లా ఏర్పాటు సమయంలో కోయిల్‌కొండ మండలాన్ని నారాయణపేట్ జిల్లాలో కలుపడాన్ని వ్యతిరేకిస్తూ మండల అఖిల పక్ష నాయకులందరం కలిసి పోరాటం చేయగా.. ఆ సమయంలో సీఐ పాండురంగారెడ్డిపై దాడి చేశారని 10మంది ఉద్యమకారులపై కేసులు నమోదు చేశారు. కేసులో సరైన సాక్ష్యాధారాలు లేనికారణంగా 10మందిపై ఉన్న కేసును కొట్టి వేసిందని తెలిపారు. కేసు కొట్టి వేయడంతో అఖిల పక్ష నాయకులను సన్మానించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కోయిల్‌కొండ మండల అఖిల పక్ష జేఏసీ నాయకులు యాదిరెడ్డి, ఆనంద్‌రెడ్డి, కృష్ణయాదవ్, రామకృష్ణారెడ్డి, నరేందర్, హనుమంతు, వెంకటేశ్, శ్రీనివాస్‌యాదవ్, కనకయ్య పాల్గొన్నారు.