
గంగమ్మ గలగల
● జూరాలకు భారీగా వరద
● ప్రాజెక్టు 39 క్రస్టుగేట్ల ఎత్తివేత
● 4.64లక్షల క్యూసెక్కుల నీరు
దిగువకు విడుదల
ధరూరు/దేవరకద్ర/మదనాపురం: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదకు అనుగుణంగా ప్రాజెక్టుల గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు శుక్రవారం రాత్రి 9 గంటల వరకు 2.41లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. శనివారం రాత్రి 7:30 గంటల వరకు ఇన్‌ఫ్లో 4.31లక్షల క్యూసెక్కులకు పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు వద్ద 39 క్రస్టుగేట్లను ఎత్తి 4,63,982 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.068 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
నిలిచిన విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: జూరాలకు భారీగా వరద వస్తుండటంతో జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఇప్పటి వరకు ఎగువ, దిగువ కేంద్రాల్లో 741.652 మి.యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు.
● భారీ వర్షాలతో కోయిల్‌సాగర్ ప్రాజెక్టుకు వరద పెరగడంతో 6 గేట్లను తెరిచి 10వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. శుక్రవారం నుంచి ప్రాజెక్టు గేట్లను తెరవడంతో సందర్శకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఓవైపు వర్షం కురుస్తున్నా సందర్శకులు మూసిన గేట్ల నుంచి జాలువారుతున్న నీటిలో మునిగి తేలారు. పిల్లలు, పెద్దలు నీటిలో ఈదుతూ సెల్ఫీలు దిగారు. కొందరు యువకులు చేపలు పడుతూ కనిపించారు.
● రామన్‌పాడు జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తో డు కోయిల్‌సాగర్, సరళాసాగర్ జలాశయాల నుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జలాశయం 6 గేట్లు ఎత్తి 36వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
● సరళాసాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద వచ్చి చేరడంతో సైఫాన్లు ఆటోమెటిక్‌గా తెరుచుకున్నాయి. 3 ప్రైమరీ, 3 వుడ్ సైఫన్ల ద్వారా 11,859 క్యూసెక్కుల నీరు దిగువకు పారుతోంది. మదనాపురం సమీపంలోని వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. మదనాపురం వద్ద కాజ్‌వే మునిగిపోయింది. వనపర్తి, ఆత్మకూర్, అమరచింత, చిన్నచింతకుంట, మదనాపూర్, కొత్తకోట మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

గంగమ్మ గలగల