
కాత్యాయని.. కనికరించమ్మా
● అలంపూర్ ఆలయాల్లో
కొనసాగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు
● ఆరోరోజు ప్రత్యేక పూజలు
నిర్వహించిన అర్చకులు
అలంపూర్: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం ఆరోరోజు జోగుళాంబ అమ్మవారు క్యాతాయని దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని ప్రత్యేక మండపంలో కొలువుదీరిన కాత్యాయనిదేవిని అర్చకులు విశేష పూజలతో ఆరాధించారు. కొలువు, కుమారి, సువాసిని పూజలతో పాటు దర్బారు సేవ, మంత్ర పుష్పములతో పూజించారు. అనంతరం మహా మంగళహారతినిచ్చారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో ఆరోరోజు జోగుళాంబ అమ్మవారిని కాత్యాయనిదేవిగా భక్తులు పూజిస్తారని.. వ్యాఘ్రవాహిణిగా(పులిని వాహనంగా ధరించి) భక్తులకు దర్శనమిస్తుందని అర్చకులు వివరించారు. మాతను ఆరాధించడంతో అనుష్టానపరులకు అతీత శక్తులు ప్రాప్తిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసంగా పేర్కొన్నారు. అలాగే జోగుళాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు, సహస్రనామ అర్చన, చండీహోమాలు, నవావరణ అర్చనలు విశేషంగా జరిగాయి. అమ్మవారిని దర్శించుకోడానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం అమ్మవారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు.
దర్శించుకున్న మహబూబ్‌నగర్ కలెక్టర్..
అలంపూర్ ఆలయాలను మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేందిర బోయి కుటుంబ సమేతంగా శనివారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం పలికారు.

కాత్యాయని.. కనికరించమ్మా

కాత్యాయని.. కనికరించమ్మా